బీజేపీ సీనియర్ నేత విజయశాంతి కామారెడ్డి రైతుల ఆందోళన విషయంలో తెలంగాణ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. కేసీఆర్ నియంతృత్వ ధోరణికి కామారెడ్డి సంఘటన అద్దం పడుతుందని ఆమె దుయ్యబట్టారు.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను రద్దు చేసి.. ఇండస్ట్రియల్, గ్రీన్ జోన్ లను తొలగించాలంటూ అన్నదాతలు కదం తొక్కారని చెప్పారు. ఇక ఇండస్ట్రియల్ జోన్ తో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న రైతు రాములు కుటుంబం ఉసురు కేసీఆర్ కుటుంబానికి తగులుతుందన్నారు విజయ శాంతి. అన్నదాతల జీవనాధారమైన పంట పొలాల్లో మాస్టర్ ప్లాన్ ల పేరుతో ఇండస్ట్రియల్ జోన్ లు ఏర్పాటు చేస్తూ ఆ భూములకు ధర రాకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.
రైతులు రెండు పంటలు పండించుకోకుండా.. పొట్టకొడుతున్నరంటూ రోడ్డెక్కిన అడ్లూర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, టెక్రియాల్, ఇల్చిపూర్, లింగాపూర్ గ్రామాలకు చెందిన రైతుల పట్ల ప్రభుత్వ తీరు చాలా దారుణంగా ఉందని కేసీఆర్,కేటీఆర్ లపై ఆమె ఫైర్ అయ్యారు. ఆత్మహత్య చేసుకున్న రైతు రాములుకు నివాళి అర్పించి కలెక్టరేట్ వరకు 3వేల మంది రైతులు భారీ ర్యాలీగా వెళితే..అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు ఆమె. మాస్టర్ ప్లాన్ రద్దు, ఇండస్ట్రియల్ జోన్ తొలగింపుపై జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ బయటకు వచ్చి ప్రకటన చేయాలంటూ పెద్దఎత్తున రైతు నినాదాలు చేస్తే.. వారిని పోలీసులు తరమేయడం దారుణమన్నారు.
ఇక అన్యాయానికి గురైన రైతన్నలకు అండగా నిలిచేందుకు వచ్చిన మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ ని సైతం అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ధర్మ పోరాటం చేస్తున్న సంజయ్ పై దుర్మార్గ దమనకాండకు పాల్పడ్డ ప్రతీసారి కేసీఆర్ నియంతృత్వ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతికూల ఫలితాలు వచ్చి తీరతాయన్నది చరిత్ర తిరిగి చెబుతున్న సత్యమని ఆమె కేసీఆర్ పై మండిపడ్డారు. ఐనా మారకపోవడం బీఆర్ఎస్ పార్టీ ఖర్మ అని ఆమె వ్యాఖ్యానించారు.