రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే కామారెడ్డి మాస్టర్ ప్లాన్ మార్చారని తెలంగాణ బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో తన భూమి పోతుందని భయపడి రాములు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన కుటుంబాన్ని బండి సంజయ్ ఈ రోజు పరామర్శించారు.
రాములు కుటుంబాన్నిచూస్తే బాధ కలుగుతోందని ఆయన పేర్కొన్నారు. మృతుడి కుటుంబానికి తమ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇండస్ట్రియల్ జోన్ పేరు చెప్పి రెండు పంటలు పండే పొలాలను గుంజుకోవడం చాలా దారుణమని ఆయన అన్నారు.
ఏం చేసినా ఎదురు తిరిగి అడగలేరనే ధైర్యంతోనే రైతుల పొట్టలు కొట్టే ప్రయత్నాలను ప్రభుత్వం చేస్తోందని ఆయన ఆరోపణలు చేశారు. తాను ఈ రోజు రాత్రంతా కలెక్టరేట్ బయటే కుర్చుకుంటానని తెలిపారు. ఇక కామారెడ్డి కలెక్టర్ ఎందుకు రారో చూస్తానని ఆయన వెల్లడించారు.
కామారెడ్డి కలెక్టర్ పై ఆయన ఫైర్ అయ్యారు. కలెక్టర్‌కు కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదంటూ ఆయన ధ్వజమెత్తారు. ఈ విషయంలో రైతులకు న్యాయం జరిగే వరకు ఉద్యమం చేస్తానని ఆయన తేల్చి చెప్పారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ముకాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.