అతి వేగం.. మద్యం మత్తు.. తొమ్మిది కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. పలువురిని ఆస్పత్రి పాలుజేసింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి సమీపంలో జరిగిన ప్రమాదం డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని ప్రత్యేక్షసాక్షులు తెలిపారు. ఆదివారం జరిగిన ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి దేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.
25 మంది ప్రయాణికులతో వస్తున్న టాటా ఏస్ వాహనం.. ఎల్లారెడ్డి సమీపంలోని హసన్‌పల్లి గేటు వద్ద ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ముగ్గురు మరణించగా.. ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మరో నలుగురు తనువుచాలించారు. చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారు. 14 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిట్లం మండలంలోని చిల్లర్గి గ్రామానికి చెందిన సౌదర్‌పల్లి మాణిక్యం గత గురువారం మరణించారు. దశదినకర్మ అనంతరం ఆచారం ప్రకారం.. వారి కుటుంబ సభ్యులను ఆదివారం టాటా ఏస్ వాహనంలో ఎల్లారెడ్డి పట్టణంలోని వారపుసంతలో అంగడిదింపుడు కార్యక్రమానికి తీసుకెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు.
ఈ క్రమంలో టాటా ఏస్ డ్రైవర్ అతివేగంగా వాహనాన్ని నడిపి.. నిజాంసాగర్ మండలం హసన్‌పల్లి గేటు వద్ద ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టాడు. అయితే, ప్రమాద సమయంలో డ్రైవర్ మద్యంమత్తులో ఉన్నాడని క్షతగాత్రులు తెలిపారు. డ్రైవింగ్ చేయొద్దని చెప్పినా వినకుండా మత్తులో డ్రైవింగ్ చేశాడని, వాహనాన్ని తప్పించేందుకు లారీ డ్రైవర్ రోడ్డు కిందకు తప్పించినా లాభం లేకపోయిందని తెలిపారు.
ఈ ఘటనపై కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ‘ఈ సంఘటన చాలా దురదదృష్టకరం. హసన్‌పల్లి వద్ద భయంకరమైన ఘటన జరిగిపోయింది. దయచేసి ప్రజలందరూ గమనించాలి. గూడ్స్ వాహనాల్లో ప్రయాణించవద్దు. సురక్షిత ప్రయాణం చేస్తారని ఆశిస్తున్నాను. ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలి.’ అని తెలిపారు.