కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై రైతుల ఆందోళన తెలంగాణ సర్కార్ మెడకు చుట్టుకుంటూనే ఉంది. మాస్టర్ ప్లాన్ ను పూర్తిగా రద్దు చేసే వరకు అన్నదాతలు తగ్గేదేలే అన్నట్టు..నిరసనను కొనసాగిస్తూనే ఉన్నారు. ఎన్ని రకాలుగా ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేయాలో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కలెక్టర్, ఎమ్మార్వో,ఆర్డీవోలకు వినతి పత్రాలు ఇచ్చి ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చిన కామారెడ్డి అన్నదాతలు ఇప్పుడు కేటీఆర్ దగ్గరికి ట్వీట్ ద్వారా సమస్యను తీసుకెళ్లారు.
జగిత్యాల మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని కోరుతూ మంత్రి కేటీఆర్ కు మోతె సర్పంచ్ స్వప్న భర్త రాజేశ్వర్ రెడ్డి ట్వీట్ చేశారు. జిల్లాలోని మోతె,ధరూర్, తిప్పన్నపేట్, నర్సింగాపూర్, తిమ్మాపూర్, హుస్నాబాద్, అంబారి పేట్ లలో మాస్టర్ ప్లాన్ ను క్యాన్సిల్ చేయాలని ఈ సందర్భంగా ఆయనకు విన్నవించుకున్నారు.
ఇక ఇదే విషయంపై ఆయా గ్రామాల్లో ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అంబారి పేట, హుస్నాబాద్ గ్రామాల్లో తమ భూములను మాస్టర్ ప్లాన్ నుంచి మినహాయించాలని డిమాండ్ చేస్తూ ఆయా గ్రామాల పంచాయతీల్లో ఇప్పటికే తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా అంబారిపేట్ లో పలువురు రైతులు, గ్రామస్తులు గ్రామ పంచాయతీ బిల్డింగ్ పైకి ఎక్కి నిరసన తెలిపారు. తర్వాత ఛలో కలెక్టరేట్ కు పిలుపునిచ్చారు. అది ఉద్రిక్తతకు దారి తీసింది.
కలెక్టర్ రవిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేయడంతో ఆయన లేరని,ఒప్పుకుంటే ఐదుగురిని మాత్రమే అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ను కలవడానికి పర్మిషన్ ఇస్తామని చెప్పారు. దీంతో ఐదుగురు వెళ్లి ఏఓ చరణ్ కు వినతి పత్రం ఇచ్చి వచ్చారు. మరో వైపు జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామ పంచాయతీలో మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని తీర్మానం చేసి జగిత్యాల మున్సిపల్ ఆఫీస్ లో తీర్మాన పత్రాన్ని అందజేశారు.