రాత్రికి రాత్రే బీజేపీ ఏపీ అధ్యక్ష పదవికి కంభంపాటి గుడ్‌బై!

రాత్రికి రాత్రే ఏపీ బీజేపీలో ఆకస్మిక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోమవారం రాత్రి అధ్యక్ష పదవికి రాజీనామా చేసి.. ఆ లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు పంపించారు. కేంద్రం నిధులు పంపిస్తుంటే, వద్దంటున్నారంటూ నిన్న ఉదయమే లెక్కలతో సహా టీడీపీ పై విరుచుకుపడిన హరిబాబు, ఇంత అకస్మాత్తుగా ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందన్నది ఇప్పుడు ఏపీ పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. అయితే, ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపిక గురించి కొంతకాలంగా అనేక ఊహాగానాలు చెలరేగుతున్న నేపథ్యంలో అధ్యక్ష పదవిని హరిబాబు తనకు తానుగా వదులుకున్నారా? లేక అధిష్ఠానం సూచన మేరకే రాజీనామా చేశారా? అన్నది తెలియాల్సి ఉంది.

అయితే, తన రాజీనామా విషయంపై ఈ ఉదయం హరిబాబు స్పందించారు. వచ్చేది ఎన్నికల సంవత్సరమని.. యువకులను ప్రోత్సహించాలన్నది తన అభిమతమని, వారికి అవకాశాల కోసమే తాను పదవి నుంచి తప్పుకుంటున్నానని తెలిపారు. తన స్థానంలో ఓ యువకుడిని నియమించాలని కోరారు. నాలుగేళ్లపాటు తనపై నమ్మకం ఉంచి అధ్యక్ష బాధ్యతలను అప్పగించినందుకు పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు హరిబాబు.