మా దగ్గరి బంధువులు ఐసీయూలో ఉన్నారు. చూసి రావాలి అనుకుంటున్నాం. అని మీరెప్పుడైనా ఆసుపత్రికి వెళ్లాలనుకుంటున్నారా… మీరు వెళ్లేది ఎల్.బి నగర్ కామినేని ఆసుపత్రి అయితే అస్సలు పొరపాటున కూడా వెళ్లకండి. కావాలంటే… మీ బంధువులు ఇంటికి వచ్చాక వెళ్లి పలకరించండి. అదేంటీ ఆపదలో ఉన్నప్పుడు పలకరించకుండా ఇంటికి వచ్చాక వెళ్తే ఏమనుకుంటారు అని ఆలోచించకండి. ఎందుకంటే… మీరు చూసి రావాలి అని ఆసుపత్రికి వెళ్తే దానికి కూడా ఆసుపత్రిలో బిల్లు కట్టాల్సిందే. అదేంటీ… చూసి వస్తే బిల్లు ఎందుకు అనుకుంటున్నారా…
జలగల్లా జనాన్ని పీడించి… ఆసుపత్రి అంటేనే భయంతో వణికిపోయేలా చేశాయి కార్పోరేటు ఆసుపత్రులు. కాసుల కక్కుర్తితో, ప్రజల సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునే కార్పోరేట్ ఆసుపత్రులు… ఇప్పుడు మరో అడుగు ముందుకేశాయి. ఇన్నాళ్లు పేషేంట్లపైనే వేలకు వేలు బిల్లులు వేస్తూ సొమ్ము చేసుకునే వారు. ఇప్పుడవి చాలటం లేదన్నట్లు మరో దోపిడికి శ్రీకారం చుట్టాయి.
ఎల్.బి నగర్ కామినేని ఆసుపత్రిలో నిత్యం ఎంతో మంది ప్రాణపాయ స్థితిలో ఆసుపత్రికి వస్తుంటారు. నేషనల్ హైవేస్‌కి దగ్గరగా, సిటీ ఎంట్రెన్స్‌లో ఉండటంతో ఎప్పుడూ కిక్కిరిసి ఉంటుంది. ట్రీట్‌మెంట్‌తో పాటు బిల్లు కూడా అంతే స్థాయిలో వస్తుంది. కానీ ఆసుపత్రికి వచ్చే ఆదాయం సరిపోనట్లు… పేషేంట్లపై వేస్తోన్న అడ్డగోలు బిల్లు చాలవన్నట్లు… ఐసీయూలో పేషేంట్‌ను చూడటానికి కూడా 200లు చార్జ్ చేస్తుండటం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. నిర్ణిత సమయంలోనే 5గురికి మించకుండా ఐసీయూలోని పేషేంట్‌ను చూసేందుకు అనుమతిస్తారు. కానీ ఇప్పుడు ఆ ఐదుగురికి ఒక్కోక్కరికి 200రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. పైగా ఆ బిల్లును కూడా పేషేంట్ బిల్లులో కలిపేస్తున్నారు.
ప్రభుత్వాసుపత్రిలో ఐసీయూలోకో, పేషేంట్‌ను చూసేందుకో వచ్చే వారి నుండి పదో, యాభైయో తీసుకొని చాటుగా సిబ్బంది పంపిస్తుంటారు. ఇప్పుడు కామినేని ఆసుపత్రి తీరు కూడా అంతే కక్కుర్తితో ఉందని పలువురు మండిపడుతున్నారు. ఎలాగు మీరు వేసే బిల్లులపై అజమాయిషీ లేదు, ఇప్పుడు ఇక్కడా వదలరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వైద్యారోగ్య శాఖ దీనిపై సీరీయస్‌గా స్పందించి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.