శరన్నవరాత్రి మహోత్సవాలలో అమ్మవారి అలంకారాలలో చివరి రూపం శ్రీ రాజరాజేశ్వరీదేవి. సకల భువన బ్రహ్మాండాలకు రాజరాజేశ్వరీదేవి ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయంలో పూజలందుకుంటుంది. ఈ దేవిని అపరాజితాదేవిగా కూడా భక్తులు పూజించే ఆచారం ఉంది.
రాజరాజేశ్వరి స్వప్రకాశ జ్యోతి స్వరూపిణి. పరమేశ్వరుడి అంకం అమ్మకు ఆసనం. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను ఈ మూర్తి తన భక్తులకు వరాలుగా అనుగ్రహిస్తుంది. ఈమె యోగమూర్తి. మాయా మోహిత మానవ మనోచైతన్యాన్ని రాజరాజేశ్వరీ దేవి ఉద్దీపితం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈమె అధిష్టాన దేవత. “ఐం క ఏ ఈల హ్రీం, క్లీం హసకహల హ్రీం సౌ: సకల హ్రీం” అనే మంత్రం జపించాలి. లలితా సహస్రనామం పారాయణ చేసి కుంకుమార్చన చేయాలి. లడ్డూలు నివేదన ఇవ్వాలి. సువాసినీ పూజ చేయాలి. అవకాశం ఉంటే శ్రీ చక్రార్చన చేస్తే మంచిది
అమ్మవారు మహిషాసురుడనే రాక్షసుడి మీద తొమ్మిది రాత్రుల పాటు యుద్ధం చేసి.. పదవ రోజున విజయం సాధించారు. ఇలా విజయం సాధించి పరిపూర్ణమైన రూపంలో కనిపించే తల్లిని రాజరాజేశ్వరి దేవిగా పిలుచుకుంటాం. రాజ రాజేశ్వరి అంటే రాజులకి సైతం రాజు అని అర్థం. ఈ తల్లిని మించిన శక్తి ప్రపంచంలోనే లేదు కాబట్టి ఆ పేరు వచ్చింది. ఈ తల్లి బంగారు సింహాసనం మీద నాలుగు చేతులతో కూర్చుని దర్శనమిస్తుంది. ఒక చేతిలో పాశం, మరొకచేతిలో అంకుశం, ఇంకో చేతిలో చెరుకుగడ ఉండగా అభయ హస్తంతో కనిపిస్తుంది.
ఈ ప్రపంచంలోని ప్రాణుల అందరి ఆలోచనలూ, ఇంద్రియాల మీద రాజరాజేశ్వరీదేవి అధికారం ఉంటుందట. అందుకనే పాశం! ఆమెని కొలిస్తే, మన జీవితాలను సరైన దారిలో నడిపిస్తుంది కనుక అంకుశం. ఇక చెరుకుగడ ధనధాన్యాలకు చిహ్నం. ఆ తల్లిని కొలిస్తే జీవితంలో ఎలాంటి లోటూ లేకుండా తీయగా సాగిపోతుందనే సూచన. మరి విజయదశమి సందర్భంగా ఆ తల్లిని ఎలా కొలుచుకోవాలో తెలుసుకుందాం!
విజయదశమి రోజున తెల్లవారే లేచి తలార స్నానం చేసి.. పూజగదిని శుభ్రం చేసుకోవాలి. పైన చెప్పుకొన్న విధంగా అంకుశము, పాశము, చెరుకుగడ, అభయహస్తం ఉన్న రాజరాజేశ్వరీదేవి పటాన్ని పూజలో ఉంచాలి. విజయదశమి విజయానికి చిహ్నం కాబట్టి ఈ రోజు అమ్మవారిని ఆకుపచ్చ రంగు వస్త్రంతో అలంకరించాలి. రాజరాజేశ్వరి అష్టకం లేదా లలితా సహస్రనామం చదువుతూ ఎర్రటి పూలతో అమ్మవారిని పూజించాలి. ఈ స్తోత్రాలేవీ కుదరని పక్షంలో ‘ఓం హ్రీం రాజరాజేశ్వరీ మాత్రే నమః’ అన్న మూలమంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుతూ ఆ తల్లిని పూలతో అర్చించాలి.
అమ్మవారు ధనధాన్యాలను అనుగ్రహిస్తారు అని చెప్పుకొన్నాం కదా! అందుకనే అన్నిరకాల కూరగాయలతో వండిన శాకాన్నం అనే పదార్థాన్ని నివేదిస్తారు. ఇక కూరగాయలలో గుమ్మడికాయని పరిపూర్ణతకి చిహ్నంగా భావిస్తారు. అందుకని గుమ్మడికాయని మాత్రం ఈరోజు తినడం కానీ కోయడం కానీ చేయడకూదని సూచిస్తున్నారు పెద్దలు.
అమ్మవారు ధన ధాన్యాలని మాత్రమే కాదు సౌభాగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. సౌభాగ్యం అంటే చక్కటి పూలమాలలే గుర్తుకువస్తాయి. అందుకని ఈ రోజున అమ్మవారి పేరు మీద ఓ ముత్తయిదువకు పూలమాలలను దానం చేయాలని చెబుతున్నారు. ఈ రకంగా కనుక అమ్మవారిని విజయదశమి రోజు పూజిస్తే జీవితంలో ఇక దేనికీ లోటు రాదు. ఆహారం, ఆరోగ్యం, ఆలోచన, శక్తి, సౌభాగ్యం, సంతానం.. అన్నీ దక్కి తీరుతాయి.