దేవుడు తిరుమల తిరుపతి దేవస్థానం వారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అయినా వారికింకా పూర్తిగా కళ్లు తెరుచుకోలేదు. ఈలోపు దేవత కూడా ఆగ్రహించింది. అందులోనూ దుర్గమ్మ తల్లి. వద్దు వద్దు ఎంతమంది చెప్పినా వినకుండా ఆలయం తెరిచారు. ఇప్పుడు ఈవోతో సహా 18 మంది కరోనా పాజిటివ్ కన్ ఫామ్ అయింది. ఒక అర్చకుడు సైతం కరోనాతో మరణించాడు. ఈ 18 మందిలో దుర్గగుడి ఉద్యోగులు, కాంట్రాక్టర్, ఇతరులు ఉన్నారు.
అన్ లాక్ లో కేంద్రం దేవాలయాలు తెరుచుకోవచ్చని చెప్పిన వెంటనే.. ఎక్కడా ఆగకుండా దుర్గగుడిని తెరిచి.. దర్శనాల కోసం తాపత్రయపడ్డారు దేవస్థానం వారు. భక్తులు సైతం అలాగే.. ఆగకుండా దేవి దర్శనం కోసం వెళ్లారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా ఆగదని.. పైగా లక్షణాలు కనపడకుండానే పాజిటివ్ వస్తుందన్న విషయం తెలిసినా.. తూతూ మంత్రంగా థర్మామీటర్ తో జ్వరం ఉందో లేదో చెక్ చేసి వదిలేశారు.
ఇప్పుడు భక్తులు తెచ్చారో.. ఉద్యోగులు తెచ్చారో తెలియదు గాని… కరోనా అయితే వచ్చేసింది. అధికారులు, ఉద్యోగులు, భక్తులు అందరూ దాని బారిన పడ్డారు. మరిప్పుడు దుర్గగుడి తాత్కాలికంగానైనా మూస్తారా లేదా అన్నది ప్రశ్నగా మారింది. ఇప్పటికే కలెక్టర్, ఇతర వైద్యశాఖ అధికారులు మూసేయమని సలహా ఇవ్వగా.. మూసేయడాన్ని ప్రెస్టేజ్ కు తీసుకుని.. మంత్రి వెల్లంపల్లి.. మరికొందరు.. అందుకు అంగీకరించడం లేదు. మూయడం అంటే పూర్తిగా కూడా కాదు.. అంతకు ముందులా.. భక్తులను రానీయకుండా చేసి.. కేవలం పూజా కార్యక్రమాలు అంతరాయం లేకుండా అర్చకులే కానీచ్చేటట్లు చేయాలని.
ఇంకో విషయం ఏంటంటే..వారం క్రితమే దుర్గగుడి బోర్డు సమావేశం జరిగింది. అందులో ప్రస్తుతం పాజిటివ్ వచ్చిన ఈవో పాల్గొన్నారు. ఆ మీటింగుకు ముందు తర్వాత.. సార్.. మంత్రిగారితో మంతనాలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. పైగా మంత్రికి ఈవోగారు బాగా క్లోజ్.. ఎన్ని ఆరోపణలు వచ్చినా.. పట్టించుకోకుండా ఇద్దరి దోస్తీ గట్టిగానే నడుస్తుంది. సో.. ఇక్కడ మంత్రిగారికి పాజిటివ్ వచ్చే అవకాశాలతో పాటు.. బోర్డు సభ్యులందరూ చెక్ చేయించుకోవాల్సిన పరిస్ధితి వచ్చింది.
ఇంత జరిగినా.. ఇంకా గుడిని మూసేయడానికి మీనమేషాలు లెక్కేస్తున్నారు. స్వయంగా ఆ దుర్గమ్మ తల్లి ఎదురొచ్చి చెప్పినా.. వినేటట్లు లేరు.. ఈ మూర్ఖశిఖామణులు.