మహాలక్ష్మీ నమోస్తుతే ! - kanaka durgamma as sree maha lakshmi- Tolivelugu

మహాలక్ష్మీ నమోస్తుతే !

ఇంద్రకీలాద్రిపై వెలసిన కనక దుర్గమ్మ ఇవాళ శ్రీమహాలక్ష్మిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. రెండు చేతులలో మాలలను ధరించి, అభయవరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీమహాలక్ష్మీ రూపుదాల్చి అమ్మవారు భక్త కోటికి కనిపిస్తోంది.

kanaka durgamma as sree maha lakshmi, మహాలక్ష్మీ నమోస్తుతే !

మహాలక్ష్మీ సర్వ మంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని. అష్టలక్ష్ముల సమష్టి రూపమే మహాలక్ష్మీ. డోలాసురుడు అనే రాక్షసుడిని వధించింది. శక్తిత్రయంలో మధ్య శక్తి. మహాలక్ష్మీని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయి. యాదేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా అంటే అన్ని జీవాలలోనూ ఉండే లక్ష్మీస్వరూపం దుర్గాదేవని చండీ సప్తసతి చెబుతోంది.

శరన్నవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వ మంగళ మాంగల్యాలు కలుగుతాయి. లక్ష్మీదేవి అంటేనే సంపదకు ప్రతిరూపం! అందుకనే ఆ తల్లిని ‘శ్రీ మహాలక్ష్మి’ అని పిలుస్తారు. ‘శ్రీ’ అంటే సిరిసంపదలే. అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కోరికైనా నెరవేరుతుందని నమ్మకం. అమ్మవారు అనుగ్రహించే వరాలను బట్టి ఆమెను ఎనిమిది రూపాలలో పూజిస్తారు. వాళ్లే అష్టలక్ష్ములు. దసరా సందర్భంగా మహాలక్ష్మిని కనుక పూజిస్తే ఈ అష్టలక్ష్ములంతా అనుగ్రహిస్తారట. మరి నవరాత్రులలో మహాలక్ష్మీదేవిని ఎలా పూజించాలో తెలుసుకుందామా..

సాధారణంగా ఆకుపచ్చ రంగు చీరంలో ఉన్న లక్ష్మీదేవినే పూజించాలని అంటారు. కానీ దసరా సమయంలో అమ్మవారిని గులాబి రంగు వస్త్రంతో అలంకరించాలట. ఇక పాలసముద్రం నుంచి ఉద్భవించినందుకు ప్రతీకగా ఆ తల్లికి తెల్లటి కలువలతో పూజ చేయాలి. తెల్ల కలువులతో పూజ చేయడం కుదరకపోతే అదే రంగులో ఉండే మల్లెలాంటి పూలతో అయినా అర్చించవచ్చు. ఇక అమ్మవారికి ఇష్టమైన క్షీరాన్ని గుర్తుచేసుకుంటూ పాలతో చేసిన పరమాన్నాన్ని తల్లికి నివేదించాలి. పరమాన్నం చేయడం కుదరని పక్షంలో అటుకులు, బెల్లం, కొబ్బరి కలిపిన ప్రసాదాన్ని కూడా సమర్పించవచ్చు.

ఈ రోజు లక్ష్మీదేవికి సంబంధించిన అష్టోత్తరం, శ్రీసూక్తం, కనకధారాస్తవం లాంటి స్తోత్రాలు చదువుకోవాలి.

‘లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం’

అనే శ్లోకాన్ని పఠించాలి. ఇవేవీ కుదరకపోతే ‘ఓం హ్రీం ఐం మహాలక్ష్మైనమః’ అనే మూలమంత్రాన్ని జపిస్తూ ఆ తల్లిని అర్చించాలి.

నవరాత్రులలో మహాలక్ష్మిని పూజించే రోజు ఉల్లిపాయని తినకూడదని పెద్దలు చెబుతున్నారు. ఉల్లిపాయ తామసిక గుణానికి చిహ్నం. అలాంటి లక్షణాలు ఉన్నచోట అమ్మవారు స్థిరంగా ఉండరు. అందుకనే ఈ పదార్థాన్ని తినకూడదని పెద్దలు చెబుతున్నారు. వీలైతే మహాలక్ష్మిని పూజించే రోజున శాకాహారమే తినడం మంచిది. నవరాత్రులలో అమ్మవారిని ఈ రకంగా పూజిస్తే కనుక ఆ తల్లి అష్టైశ్వర్యాలనీ అనుగ్రహిస్తుందని పెద్దల నమ్మకం. ఇలా మహాలక్ష్మిని నిష్టగా పూజించి అర్హులైన వారికి దక్షిణని దానం చేస్తే ధనలక్ష్మి అంతకంతా ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందట.

Share on facebook
Share on twitter
Share on whatsapp