కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ లేఖ రాశారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేతలు దాడికి ప్రయత్నించారని ఫిర్యాదు చేశారు. జెడ్ ప్లస్ క్యాటగిరీ ఉన్న నేతపై దాడికి ప్రయత్నించారని లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటనలో శాంతిభద్రతల వైఫల్యం కనిపించిందన్న ఆయన… విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబుకు మరింత భద్రతను పెంచాలన్నారు. దాడికి సంబంధించిన ఆధారాలను హోంశాఖ కార్యదర్శికి అందించారు.
Advertisements
ఇక ఈ ఇష్యూపై మాట్లాడిన కనకమేడల… చంద్రబాబు ఇంటిపై దాడి జరిగినా ఎవరిపైనా కేసు పెట్టలేదని ఆరోపించారు. పైగా టీడీపీ నేతలు, కార్యకర్తలపైనే ఎదురు కేసులు పెట్టారని మండిపడ్డారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని… దాడికి బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రధాని, హోంమంత్రిని కలిసి రాష్ట్రంలో పరిస్థితిని వివరిస్తామని చెప్పారు కనకమేడల.