బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తన స్వీయ దర్శకత్వంలో ‘ఎమర్జెన్సీ’ సినిమా తెరకెక్కిస్తోంది. తాజాగా ఈ సినిమా షూట్ కంప్లీట్ అయినట్టు కంగనా రనౌత్ సోషల్ మీడియాలో ప్రకటించింది. గతేడాది లాంటి ‘ధాకడ్’ డిజాస్టర్ తర్వాత ‘ఎమర్జెన్సీ’ సినిమాను ఆమె తెరకెక్కించారు. ఈ సినిమాలో ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటిస్తున్నారు.
ఇందిరా గాంధీ 1975లో విధించిన ఎమర్జెన్సీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇక తాజాగా పెట్టిన పోస్టులో ఈ సినిమా కోసం కంగనా తన ఆస్తులన్ని తాకట్టు పెట్టినట్లు చెప్పుకొచ్చారు. ఈ సినిమా కోసం ఎలాంటి ఇబ్బందులు పడలేదని చాలా మంది భావిస్తున్నారు కానీ అది నిజం కాదు, ఆ సినిమా షూటింగ్ సమయంలో డెంగ్యూ బారిన పడడంతో రక్త కణాల సంఖ్యా పడిపోయినా షూట్ లో పాల్గొన్నా అది నాకు పునర్జన్మ అంటూ ఆమె పేర్కొంది.
ఇక 1975లో జూన్ 25న ఇందిరా గాంధీ దేశంలో ఆర్టికల్ 352 ప్రయోగిస్తూ ఎమర్జెన్సీ విధించగా దానికి అప్పటి రాష్ట్రపతి ఫకృద్దీన్ అలీ అహ్మద్ ఆమోద ముద్ర వేశారు. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యవాదులు సహా ప్రతిపక్ష నేతలను జైల్లో వేసి పత్రికలపై సెన్సార్ విధించారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీ చిన్న కుమారుడు సంజయ్ గాంధీ షాడో ప్రధాన మంత్రిగా ఎలా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేశారనేది ఈ సినిమాలో ప్రస్తావించనున్నారు కంగనా. ‘
ఎమర్జెన్సీ అండ్ ఆపరేషన్ బ్లూస్టార్’ పుస్తకం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించగా ఈ సినిమా ఒక పొలిటికల్ డ్రామా. ఈ సినిమాకు నిర్మాణంతో పాటు దర్శకత్వం కూడా కంగనా రనౌతే చేశారు.