నటి కంగనా రనౌత్ కి సినిమాలే కాదు.. ఇతర విషయాలపైనా ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది. తరచూ ఏదో ఓ విషయంతో వార్తల్లో నిలుస్తుంది. ఇప్పుడు ఓ యువతి దుస్తులపై వ్యాఖ్యలు చేసింది. గుడికి వచ్చే సమయంలో సరైన దుస్తులు ధరించి రావాలని కంగనా సూచించింది. ఆమె అభిప్రాయంపై నెటిజన్లలో అనుకూల, వ్యతిరేక చర్చ మొదలైంది. హిమాచల్ ప్రదేశ్లోని వైద్యనాథ్ ఆలయానికి వచ్చిన ఓ యువతి పొట్టి దుస్తులు ధరించింది. ఆ ఫోటోను ట్విట్టర్ ఖాతాలో ఎవరో షేర్ చేశారు.
‘‘ఇది వైద్యనాథ్ ఆలయంలో కనిపించిన దృశ్యం. హిమాచల్ ప్రదేశ్ లో పేరొందిన ఆలయం. వారు పబ్ లేదా నైట్ క్లబ్ నకు వెళ్లిన మాదిరే ఆలయానికి వచ్చారు. ఆలయంలోకి అలాంటి వారిని అనుమతించకూడదు. నేను దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను’’ అంటూ ఈ బాలిక ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేసిన వ్యక్తి హిందీలో ట్వీట్ చేశాడు. దీన్ని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చూసి సమర్థించింది. తన గత అనుభవాన్ని కూడా పంచుకుంది.
‘ఇవన్నీ పాశ్చాత్యులు తయారుచేసిన మరియు ప్రచారం చేసిన బట్టలు. ఒకసారి వాటికన్ వెళ్లాను. షార్ట్, టీ షర్ట్ వేసుకుని ఉండడంతో నన్ను లోపలికి అనుమతించలేదు. నేను తిరిగి హోటల్కి వెళ్లి బట్టలు మార్చుకోవాల్సి వచ్చింది.’ అని కంగనా రనౌత్ ట్వీట్ చేసింది. కంగనా మాటలతో కొందరు ఏకీభవించారు. అయితే మరికొందరు మాత్రం వ్యతిరేకత వ్యక్తం చేశారు. ‘ఇది కరెక్ట్ కాదు. మీరు సినిమాల్లో అలాంటి దుస్తులను ప్రమోట్ చేస్తారు. మీరు వేసుకుంటే తప్పు కాదు, ఇతరులు వేసుకుంటే తప్పా? మీపై ఎవరైనా కామెంట్స్ చేస్తే మీకు ఇబ్బంది కలుగుతుంది కదా’ అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. ‘ఇప్పుడు ఫెమినిస్టులంతా వచ్చి వెళ్లిపోతారు..’ అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు.
ఇటీవల ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్, కంగనా రనౌత్ తదితరులు కేదార్నాథ్ ఆలయాన్నిసందర్శించారు. ఆ సందర్భంగా తీసిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది కంగనా. ఆలయ సందర్శన సమయంలో కంగనా సాంప్రదాయ నీలిరంగు దుస్తులను ధరించి ఉంది. నుదుటిపై గంధాన్ని పూసుకుని ఉన్న ఫొటోలను పోస్ట్ చేసింది. శివుడి దివ్యశక్తి ఉండే తీర్థయాత్రను సందర్శించడం ఎంత అదృష్టమో అని క్యాప్షన్ ఇచ్చింది.