95 వ ఆస్కార్ అవార్డుల వేదికపై బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ ఇచ్చిన పర్ఫామెన్స్ అదుర్స్ అని మరో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కితాబిచ్చింది. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటను దీపిక.. హాలీవుడ్ ప్రముఖులకు పరిచయం చేసిన తీరు తననెంతో ఆకట్టుకుందని ట్వీట్ చేసింది. ఓ అంతర్జాతీయ..ప్రతిష్టాత్మక వేదికపై నిలబడి హృద్యంగా, చిరునవ్వుతో మాట్లాడడం సులభం కాదని, అలాంటిది మీరు ఈ సాంగ్ ని ఇంట్రొడ్యూస్ చేసిన తీరు మొత్తం మన దేశాన్నే కలిసికట్టుగా ఉన్న వైనాన్ని స్ఫూరింపజేసిందని ఆమె పేర్కొంది.
‘హౌ బ్యూటిఫుల్ దీపికా లుక్స్.. నాట్ ఈజీ టు స్టాండ్ దేర్ హోల్డింగ్ ఎంటైర్ నేషన్ టుగెదర్’ అని కంగనా మనస్ఫూర్తిగా అభినందించింది. భారత దేశ ఇమేజ్ ని, ప్రతిష్టను తన భుజాన మోస్తున్నట్టుగా ఎంతో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుండగా వ్యాఖ్యాతగా వ్యవహరించడమంటే మాటలు కాదని, ప్రపంచంలో భారత మహిళలు అత్యుత్తములనడానికి నిదర్శనంగా దీపిక నిలిచిందని ఆమె ప్రశంసించింది.
ఆస్కార్ వేడుకకు హాజరైన వారంతా కేరింతలు కొడుతూ..ఛీర్స్ చెబుతూ.. చప్పట్లు కొడుతుంటే దీపికా పదుకోన్.. మధ్య మధ్య ఆగి చిరునవ్వుతో తన వ్యాఖ్యానాన్ని కొనసాగించింది. ఆమె గళం లోనుంచి నాటు నాటు పాటకు సంబంధించిన కామెంట్స్ వినవస్తుండగానే ఈ సాంగ్ కి బెస్ట్ ఒరిజినల్ కేటగిరీలో ఆస్కార్ పురస్కారం దక్కడం ఖాయమనిపించింది.
తొలి రౌండ్ ప్రెజెంటర్లలో దీపిక ఒకరు కాగా.. హాలే బెర్రీ, జాన్ ట్రవోల్టా, హారిసన్ ఫోర్డ్, మరికొందరు ఉన్నారు. కమెడియన్ జిమ్మీ కిమెల్ ఈ షో కి హోస్ట్ గా వ్యవహరించారు.