కంగనా రనౌత్ పరిచయం అక్కర్లేని పేరు. వన్ ఆఫ్ ద బ్రేవెస్ట్ లేడీ ఇన్ బాలీవుడ్. ఈ ధైర్యానికి మీడియా పెట్టిన పేరు ఫైర్ బ్రాండ్. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వివిధ అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో సెన్షేషనల్ స్టేట్ మెంట్స్ ఇస్తూ ఉంటుంది.
మన దేశంలో జరిగే పలు రకాల సంఘటనలపై రెగ్యులర్ గా రియాక్ట్ అవుతుంది కంగనా. తాజాగా ఓ నెటిజన్..కంగన తల్లి పొలంలో పని చేస్తున్న ఫొటోని పోస్ట్ చేశాడు. ‘కంగన చాలా ధనవంతురాలు కదా.. మరి ఆమె తల్లి ఇంకా పొలంలో ఇలా పనిచేసుకుంటుంది. ఇంతటి సింప్లిసిటీ ఎక్కడి నుంచి వచ్చింది’ అని ప్రశ్నించాడు.
అయితే ఆ పోస్ట్ ను రీట్వీట్ చేసి కంగన.. ‘నేను ధనవంతురాలు అవ్వడం వల్ల నా తల్లి ధనవంతురాలు కాదు. నేను రాజకీయ నాయకులు, అధికారులు, వ్యాపారవేత్తల కుటుంబం నుంచి వచ్చాను. మా అమ్మ 25 ఏళ్లకు పైగా టీచర్గా ఉంది.
సినిమా మాఫియా మీద నేను చూపిస్తున్న వైఖరి ఎక్కడ నుంచి వచ్చిందో మీకు అర్థమైపోయింది అనుకుంటా. మా అమ్మ అన్నీ నేర్పించింది. నేను సినిమా మాఫియాలోని వాళ్ల లాగా పెళ్లిళ్లలో డబ్బుల కోసం డ్యాన్సులు వేయను’ అని చెప్పింది.
అలాగే తన తల్లి పొలంలో పనిచేసే ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. ‘మా అమ్మ ప్రతిరోజు మా పొలంలో దాదాపు 7 గంటలు పనిచేస్తుంది. మా అమ్మకు బయట రెస్టారెంట్స్లో తినడం, విదేశాలకు వెళ్లడం, సినిమాలు చూడటం, సినిమా సెట్స్కు రావడం, ముంబయిలో నివసించడం కూడా నచ్చదు.
వీటిల్లో ఏదైనా చేయమని నేను బలవంతపెడితే నన్ను తిడుతుంది. సినిమా మాఫియాను నేను వ్యతిరేకించడం అందరూ నా అహంకారం అంటారు. కానీ నేను మా అమ్మ చెప్పిన వ్యక్తిత్వాన్ని పాటిస్తున్నాను. నేను ఎవర్నీ వేడుకొను, వేరే హీరోయిన్స్ లాగా సిగ్గుపడను, పెళ్లిళ్లల్లో డ్యాన్సులు చేయను, హీరోల గదులకు వెళ్లను.
అందుకే వాళ్ళు నన్ను పట్టించుకోరు. మీరే చెప్పండి. ఇది అహంకారామా? చిత్తశుద్దా?’ అని పోస్ట్ చేసింది. దీంతో కంగనా తన తల్లిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.