లైంగిక వేధింపుల గురించి కంగనా బయటపడడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఓ స్టార్ హీరోను టార్గెట్ చేస్తూ ఆమె లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. తనను బాలీవుడ్ లో చాలామంది వాడుకున్నారంటూ ఆమె సంచలన ప్రకటన చేసింది. ఓ స్టార్ హీరో అయితే పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని కూడా వెల్లడించింది. ఇప్పుడీ హీరోయిన్ మరోసారి లైంగిక ఆరోపణల్ని తెరపైకి తీసుకొచ్చింది. అయితే ఇవి పాత ఆరోపణలు కావు.
ప్రొఫెషనల్ గా తను ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ అనుభవాల్ని ఇప్పటికే బయటపెట్టిన కంగనా రనౌత్.. తను చిన్నప్పట్నుంచే లైంగికంగా వేధింపులకు గురయ్యాననే విషయాన్ని బయటపెట్టింది.
“నేను నా చిన్నప్పుడే లైంగిక వేధింపులకు గురయ్యాను. అప్పుడు నాకు ఆరేళ్లు ఉంటాయి. మా గ్రామంలో నివశించే ఓ అబ్బాయి నాతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. వాడు నా కంటే నాలుగేళ్లు మాత్రమే పెద్ద. ఆ టైమ్ లో నన్ను అభ్యంతరకరంగా తాకేవాడు. లైంగిక వేధింపులకు గురవుతున్నాననే విషయం అప్పుడు నాకు తెలియదు. పిల్లల విషయంలో పెద్దలు ఎంత కేర్ తీసుకుంటున్నప్పటికీ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి.”
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ లాక్ అప్ అనే రియాల్టీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. ఈ కార్యక్రమంలో ఇలా తనకు చిన్నప్పుడు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాల్ని బయటపెట్టింది. వేధింపులకు గురైన వాళ్లంతా బయటకొచ్చి మాట్లాడాలని, అప్పుడు మాత్రమే ఈ తరహా వేధింపుల్ని అరికట్టొచ్చని చెప్పుకొచ్చింది కంగన.