దేశ రాజధాని ఢిల్లీలో న్యూఇయర్ రోజు హిట్ అండ్ రన్ కేసు సంచలనం రేపింది. ఈ కేసులో తాజాగా పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న నిధి గతంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో అరెస్టైనట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఆ కథనాల ప్రకారం… 6 డిసెంబర్ 2020న మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తుండగా ఆగ్రా పోలీసులు గుర్తించి ఆమెను అరెస్టు చేశారు. ఆమెతోపాటు వున్న మరో ఇద్దరు వ్యక్తులు సమీర్, రవిని కూడా పోలీసులు అరెస్టు చేసి విచారించారు.
ఈ కేసులో బెయిల్ దొరకడంతో ఆమె బయటకు వచ్చింది. ఈ క్రమంలో అంజలి మరణంతో నిధికి ఏమైనా సంబంధం ఉందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. యాక్సిడెంట్ సమయంలో అంజలితో పాటు నిధి కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
అనంతరం ఆమెను పోలీసులు ప్రశ్నించారు. విచారణ అనంతరం నిధి సంచలన ఆరోపణలు చేసింది. ప్రమాద సమయంలో అంజలి మద్యం సేవించి ఉన్నట్టు చెప్పింది. తానే స్కూటీ నడుపుతానని అంజలి పట్టుబట్టిందని ఆమె పేర్కొంది. తనతో గొడవపడి మద్యం మత్తులో స్కూటీని స్పీడ్‌గా డ్రైవ్ చేసిందని చెప్పింది. ఈ క్రమంలో కారును ఢీకొట్టినట్లు ఆరోపించింది.
కారు కింద అంజలి పడిన విషయం తెలిసినప్పటికీ కారులోని వ్యక్తులు అంజలిని ఈడ్చుకెళ్లారని నిధి వెల్లడించింది. కానీ నిధి ఆరోపణలను అంజలి తల్లి తీవ్రంగా ఖండించారు. అంజలికి అసలు మద్యం అలవాటు లేదని ఆమె తల్లి చెప్పింది. నిధి అబద్ధం చెబుతోందని తెలిపింది.