జగన్ వేస్తోన్న ఇంగ్లీష్ మీడియం అడుగులు పేద విద్యార్థుల కోసమేనా…? ప్రతి పక్షాలకు వివరణ ఇవ్వకుండా ఎందుకీ ఎదురుదాడి…? మధ్యలో మమ్మీ -డాడి అంశం ఎందుకు తెరపైకి వచ్చింది…?
పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం చదువులు వద్దా.. నేతల పిల్లలు, మనువలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు కదా.. మరి పేదలకు ఎందుకు వద్దంటున్నారంటూ జగన్ చేస్తోన్న ఎదురుదాడి వెనుక మతం కుట్ర ఉన్నట్లు బీజేపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ పకడ్భందీగా రహస్య ఎజెండాతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు భావిస్తున్నారు.
సీఎం జగన్ నిజంగానే పేద ప్రజల గురించి ఆలోచిస్తుంటే, పేద విద్యార్థుల గురించి ప్రేమ ఉన్న వారే అయితే… తెలుగు మీడియం పూర్తిగా ఎత్తేసి, ఇంగ్లీషును రుద్దే సాహసం చేసేవారు కాదని అభిప్రాయపడుతున్నారు. అమ్మా-నాన్న సంస్కృతి పోయి మమ్మీ-డాడి సంస్కృతి తెచ్చే పనిలో జగన్ దీర్ఘకాలిక వ్యూహం ఉందని మండిపడుతున్నారు. మమ్మీ -డాడి సంస్కృతి క్రిష్టియన్ సంస్కృతని… సీఎం జగన్ కూడా అదే మతానికి చెందిన వాడు కావటంతోనే ఇంగ్లీషు మీడియం పేరు మీద దాడి ప్రారంభమయిందని, దేశ ఉప రాష్ట్రపతి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే… ఓ బాధ్యత గల సీఎంగా ఉండి కూడా వ్యక్తిగత ఆరోపణలు చేశారని అంటున్నారు.
అన్యమత ప్రచారాన్ని అడ్డుకుంటున్నారనే కుట్రలో భాగంగానే ఇటీవల సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంను కూడా ఆకస్మిక బదిలీ చేశారని మండిపడుతున్నారు. సీఎం జగన్ ఈ హిడెన్ ఎజెండాను మార్చుకోకపోతే రాష్ట్రంలో ఉద్యమాలు వస్తాయని బీజేపీ హెచ్చరిస్తోంది. తెలుగు మీడియం, ఇంగ్లీషు మీడియం అనేది కాదు చర్చ, ఈ ఎత్తుగడలో ఉన్న అంతరార్ధమే అసలు సమస్య అని స్పష్టం చేస్తున్నారు బీజేపి అధక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.