మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరారు.మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. కన్నాకు కండువా కప్పిన చంద్రబాబు నాయుడు ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. కన్నాతో పాటు ఆయన అనుచరులు కూడా టీడీపీలో చేరారు.
వారికి కూడా చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు కన్నా లక్ష్మీనారాయణ.. గుంటూరు కన్నావారితోటలోని తన నివాసం నుంచి మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం వరకు అనుచరులతో కలిసి కన్నా లక్ష్మీనారాయణ భారీ ర్యాలీ నిర్వహించారు. దాదాపు 3 వేల మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
ఇక, సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్‌లో కొనసాగిన కన్నా లక్ష్మీనారాయణ.. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఏపీలో కోట్ల విజయభాస్కర రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. కాపు సామాజిక వర్గంలో కీలక నేతగా ఉన్నారు.
అయితే ఏపీ పునర్విభజన తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. 2014లో కన్నా లక్ష్మీ నారాయణ కాషాయ కండువా కప్పుకున్నారు. అయితే రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి బాగోలేదనే ఆలోచనతో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ.. 2019 ఎన్నికలకు ముందే పార్టీ మారతారనే ప్రచారం సాగింది. టీడీపీ, వైసీపీలు కన్నాతో చర్చలు జరిపాయనే వార్తలు కూడా వచ్చాయి.