కర్ణాటకకు చెందిన హరీష్ బంగేర(32) ను సౌదీ పోలీసులు అరెస్ట్ చేశారు. హరీష్ సౌదీ అరేబియా రాజుపై అశ్లీలకరమైన పోస్టింగ్ పెట్టడమే కాకుండా మక్కాను హేళన చేస్తూ కూడా ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసిన సౌదీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని హరీష్ బంగేర భార్య సుమన, ఉడిపి డీఎస్పీకి ఫిర్యాదు చేసింది. తన భర్తను కాపాడాలని ఫిర్యాదులో కోరింది. కుందాపుర తాలూకా కోటేశ్వర బిజాడి గ్రామానికి చెందిన హరీశ్ సౌదీ అరేబియా దేశంలోని దంకాం ప్రాంతంలో గల్ఫ్ కార్టూన్ ఫ్యాక్టరీలో ఎయిర్ కండీషన్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. ఈనెల 19న ఇతరులు క్రియేట్ చేసిన పోస్టింగ్‌ను ఫేస్‌బుక్‌లో షేర్ చేశాడు. దీనిపై కొందరి నుంచి బెదిరింపు కాల్స్ రావడంతో అదే రోజు ఫేస్ బుక్ ఖాతాను రద్దు చేసుకున్నాడు. అయితే తన భార్య పేరుతో నకిలీ ఖాతాను సృష్టించి సౌదీ రాజుతో పాటు మక్కాను హేళన చేస్తూ పోస్ట్ లు పెట్టారు. దీంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సౌదీలో చట్టాలు కఠినంగా ఉండడంతో తన భర్తకు ఏమవుతుందోనని హరీష్ భార్య ఆందోళన వ్యక్తం చేస్తోంది. తన భర్తను కాపాడాలని భారత ప్రభుత్వాన్ని కోరుతోంది.