– ఒక్కొక్కరుగా సారుకు గుడ్ బై
– టీఆర్‌ఎస్ ను వీడుతున్న నేతలు
– రాజీనామా చేసిన కన్నెబోయిన రాజయ్య
– ఉద్యమకాలం నుంచి కేసీఆర్ వెన్నంటే..
– 22 ఏళ్ల బంధానికి బై బై
– ఆవేదనతో బయటకు వస్తున్నట్టు ప్రకటన
– టీఆర్‌ఎస్ లో ఉద్యమకారులు తగ్గిపోయారా?
– ఉద్యమ ద్రోహులే అందలం ఎక్కారా?
2014 ఎన్నికల తర్వాత తమది ఉద్యమ పార్టీ కాదు.. ఇకపై పక్కా రాజకీయ పార్టీ అని కేసీఆర్ ఏనాడైతే ప్రకటించారో.. అప్పటి నుంచి ఆయనలో రాజకీయ నేతే దర్శనమిస్తున్నారు. ఉద్యమ ద్రోహులను అందలం ఎక్కించుకోవడం.. పతిపక్షాలే లేకుండా ఒక్కరే రాజులా ఏలేద్దామనే ధోరణిలో ఆయన చేసిన పనులు ప్రజలకే కాదు.. ఆపార్టీ నేతలకు కూడా విసుగు తెప్పించేశాయి. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఒక్కొక్కరుగా సారుకు షాకులు ఇవ్వడం మొదలు పెట్టారు.
తాజాగా టీఆర్ఎస్ కు కన్నెబోయిన రాజయ్య యాదవ్ రాజీనామా చేశారు. దీనికి గల కారణాలను వివరిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ ఇస్తానని కేసీఆర్ మోసం చేశారని.. రాజ్యసభ హామీని కూడా మరచారని వాపోయారు కన్నెబోయిన. టీఆర్‌ఎస్ లో ఆత్మగౌరవం లేదని.. అసలు ఉద్యమకారులే లేరని వ్యాఖ్యానించారు. ఇంకా ఈ పార్టీలో ఉంటే బాధ తప్ప భవిష్యత్ ఉండదని గ్రహించానని అన్నారు. ఇదే విషయాన్ని సహచరులకు చెప్పినట్లు వివరించారు. తలదించుకొని బతుకడం.. కాళ్ళు మొక్కి బతకడం తన వల్ల కాదనే బయటకు వచ్చేసినట్లు ప్రకటించారు.
కేసీఆర్ ఇంటి నుండే ముగ్గురు మంత్రులు ఉన్నారని.. ప్రాణం ఉన్నా లేకున్నా ఆత్మగౌరవం ముఖ్యమని అన్నారు రాజయ్య. తెలంగాణ ఆత్మ గౌరవం కోసం ఉద్యమకారులంతా ఒక తాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. ఏ పార్టీలో చేరేది త్వరలోనే చెబుతానని స్పష్టం చేశారు. ప్రస్తుతం గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం కార్పొరేషన్ ఛైర్మన్ గా ఉన్నారు రాజయ్య. టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సభ్యునిగా కొనసాగుతున్నారు. ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ తో వెన్నంటే ఉన్నారు. ఆయనతో కలిసి ఖమ్మం జైలుకు వెళ్లారు.
టీఆర్‌ఎస్ ఎదుగుదలకు కారణమైన ఎందర్నో కేసీఆర్ వదిలించుకున్నారనే అపవాదు ఉంది. మొన్నటిమొన్న ఈటల రాజేందర్ కూడా తనకు అడ్డుగా ఉన్నారనే కారణంతోనే కావాలనే బయటకు పంపేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కన్నెబోయిన వంతు వచ్చిందని అంటున్నారు విశ్లేషకులు. అయితే.. రాజయ్య చేసిన ఆత్మగౌరవ నినాదం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమధ్య హుజూరాబాద్ ఎన్నికల సమయంలో ఈటల ఇదే డైలాగ్ తో కేసీఆర్ కు చుక్కలు చూపించారు. రాష్ట్ర మంత్రి వర్గం, ఎమ్మెల్యేలు అంతా గుంపుగా రాజేందర్ ను ఓడించేందుకు ప్రయత్నించినా.. ఆయన ఒక్కరే సింగిల్ గా విజయఢంకా మోగించారు. ఆత్మగౌరవ నినాదాన్ని ఆయన ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లారు. ఇప్పుడు రాజయ్య కూడా అదే మంత్రం జపిస్తున్నారు.
నిజానికి టీఆర్‌ఎస్ లో ఉన్న ఉద్యమకారులు అంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండడంతో కేసీఆర్ కు రానున్న రోజుల్లో కష్టాలు తప్పేలా లేవని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. 2014 ఎన్నికల్లో సెంటిమెంట్ తో గెలిచినా.. తర్వాత కిందిస్థాయి క్యాడర్ కోసం టీడీపీ నేతలను చేర్చుకుని పార్టీని బలోపేతం చేసుకున్నారు కేసీఆర్. తర్వాత కాంగ్రెస్ నేతలను కూడా జాయిన్ చేసుకున్నారు. అయితే.. ఉద్యమకాలంలో తెలంగాణను వ్యతిరేకించి కేసీఆర్ ను బండబూతులు తిట్టిన నేతలను సైతం చేర్చుకుని అందలం ఎక్కించడమే పార్టీలోని నిజమైన ఉద్యమకారుల మనసు నొచ్చుకునేలా చేస్తోంది. వారు స్వరం పెంచిన ప్రతీసారి ఎమ్మెల్సీ, రాజ్యసభ అంటూ దాటవేస్తుండడంతో ఎన్నాళ్లు ఎదురుచూడాలని ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు నేతలు. రానున్న రోజుల్లో టీఆర్‌ఎస్ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.