• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Opinion » తెలంగాణలో ఏం సాధించారని.. దేశానికి విలువలు నేర్పుతారు?

తెలంగాణలో ఏం సాధించారని.. దేశానికి విలువలు నేర్పుతారు?

Last Updated: October 6, 2022 at 2:18 pm

కన్నెగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక

పాము ఎన్ని మెలికలు తిరిగినా పుట్టలోకి సక్కగానే వెళుతుంది. బీజీపీని ఓడించడానికి కూటమి కడతాం అని ప్రగల్భాలు పలికి దేశమంతా తిరిగి.. చివరికి ఆ పార్టీకే లాభం చేసేలా కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి(నిజానికి ఇది బీజీపీ రాష్ట్ర సమితి) పార్టీని ప్రకటించారు. దేశానికి గానీ, రాష్ట్రానికి గానీ బీజీపీ ప్రవచిస్తున్న ఎజెండా అత్యంత ప్రమాదకరమైంది. రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా అఖండ భారత్ లక్ష్యంగా, మైనారిటీలపై తీవ్ర ద్వేషాన్ని ప్రజలలో ప్రోత్సహిస్తున్నాయి ఆర్‌ఎస్‌ఎస్, బీజీపీ. వివిధ రూపాలలో సాగిస్తున్న ప్రచారం, కార్యక్రమాలు తెలంగాణలో మరింత విస్తరించకుండా, తగిన కార్యాచరణను, ప్రజల మధ్య సహృద్భావ వాతావరణాన్ని పెంచుతూ తగిన కార్యక్రమాలను ప్రజాస్వామిక వాదులందరూ తప్పకుండా చేపట్టాల్సి ఉంది. కానీ ఈ మొత్తం బాధ్యతను, కే‌సీఆర్ భుజస్కంధాలపై పెట్టి, ఆయనను వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో గెలిపించడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించాలని భావిస్తే, అది రాష్ట్రానికి మళ్ళీ తీవ్ర నష్టం చేయడమే అవుతుంది. కేవలం ఎన్నికల ద్వారా బీజీపీ భావజాలాన్ని ఓడించడం సాధ్యం కాదని, గత రెండు దశాబ్దాలుగా అనేక సార్లు రుజువైంది.

ముఖ్యమంత్రి హోదాలో యజ్ఞాలూ, యాగాలూ, దేవాలయాల పునరుద్ధరణ కార్యక్రమాలు చేయడం ద్వారా బీజీపీ ఎజెండాను తన ఖాతాలో వేసుకుని హిందువుల ఓట్లను గంపగుత్తగా దండుకోవాలనేది కేసీఆర్ ప్లాన్. అలాగే ముస్లింల సమస్యలను పరిష్కరించకుండా, కేవలం మతతత్వ ఎజెండా కలిగిన ఎంఐఎంను పక్కన ఉంచుకోవడం ద్వారా, ఆ వర్గం ఓట్లను కొల్లగొట్టాలనే యావ తప్ప నిజంగా కేసీ‌ఆర్ భారత రాజ్యాంగం ప్రవచించిన లౌకిక స్వభావాన్ని, ప్రజాస్వామిక దృక్పథాన్ని ఎప్పుడూ కలిగి లేరు. రాజ్యాంగ ఆదేశిక సూత్రాలలో ప్రజలలో శాస్త్రీయ దృక్పధాన్ని పెంచడం ప్రభుత్వాల, పాలకుల బాధ్యత అని స్పష్టంగా చెప్పారు. మరి, కే‌సి‌ఆర్ ఆచరణ అందుకు అనుగుణంగా ఉంది. వచ్చే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా కే‌సీఆర్ వేసే అనేకానేక ఎత్తుగడలలో, ప్రస్తుతం బీజీపీకి వ్యతిరేకంగా దండెత్తడం కూడా ఒక భాగం. బీజీపీని దేశ వ్యాప్తంగా ఓడించడానికి అవసరమైన, నిబద్ధత కలిగిన కార్యాచరణ గతంలో ఎప్పుడూ ఆయన చేపట్టలేదు. కాంగ్రెస్ ను దూరంగా పెట్టి, మిగిలిన బీజీపీ వ్యతిరేక పక్షాలను కూడగట్టడానికి ఆయన చేసిన ప్రయత్నాలు ఫలితం ఇవ్వలేదు. ఇప్పుడు తెలంగాణ అనుభవాలతో, దేశానికి ఎజెండా రూపొందిస్తామని, ఇది కేవలం ఎన్నికలలో ఒక పార్టీని దించి, ఇంకో పార్టీని ఎక్కించడం కోసం కాదని, దేశ సమగ్ర అభివృద్ధికి ఉపయోగపడేలా తమ ఎజెండా ఉంటుందని బీఆర్ఎస్ ను ప్రకటించారు.

గత ఎనిమిదేళ్లుగా రాష్ట్రంలో కొనసాగుతున్న కే‌సీ‌ఆర్ పరిపాలనా తీరును గమనిస్తున్నవాళ్లకు ఈ ప్రకటన మరింత ప్రమాదకరంగా కనపడుతోంది. రాష్ట్రంలో గొప్ప పథకాలు, కార్యక్రమాలుగా కే‌సీ‌ఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసుకుంటున్న అంశాలు నిజంగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతున్నాయా? రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దించుతున్నాయా? రాష్ట్రంలో కొందరి ఆస్తుల పెరుగుదలకు ఉపయోగపడుతున్నాయా? రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి సూచీ పెరుగుదలకు తోడ్పడుతున్నాయా? వీటిపై లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. దేశంలో ప్రజాస్వామిక పాలన అంటే ఏంటి అన్నది రాజ్యాంగం ఎప్పుడో నిర్వచించింది. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు చేయవలసిందల్లా అటువంటి పాలనను ప్రజలకు అందించడమే. కానీ, రోజు వారీ పరిపాలనలో అటువంటి లక్షణాలు ప్రదర్శించకుండా, దేశానికి ఒక కొత్త అజెండాను ఏమి రూపొందిస్తారు? రాజరిక లక్షణాలతో పరిపాలన సాగించే వాళ్ళు ప్రజల కోసం ప్రజాస్వామిక అభివృద్ధి ఎజెండాను ఎలా రూపొందిస్తారు?

రాష్ట్రంలో నీటి పారుదల రంగంలో గొప్ప ముందడుగు వేశామని చెప్పుకుంటున్న ప్రభుత్వం, గత ప్రభుత్వాలు చేపట్టిన ప్రాజెక్టులను, కొన్ని వేల కోట్లతోనే పూర్తి చేయడానికి అవకాశం ఉండగా, వాటిని పక్కన పడేసి , తిరిగి రీ డిజైనింగ్ పేరుతో రూపొందించిన ప్రాజెక్టుల కోసం చేసిన అప్పు ఎంత? సాధించిన ఫలితం ఏంటి? కొత్తగా సాగు నీరు అందిన భూమి విస్తీర్ణం ఎంత? తప్పుడు డిజైన్లతో నిర్మించిన ప్రాజెక్టుల వల్ల వరదలు వచ్చినప్పుడు ముంపునకు గురై ప్రజలకు జరుగుతున్న నష్టం ఎంత? నీటిని నిజంగా వ్యవసాయానికి అందించడానికి ఉన్న పంటల ప్రణాళిక లేంటి? కోకో కోలా లాంటి కంపెనీలకు నీటిని తక్కువ ధరలకే ధారాదత్తం చేయడానికి చేసుకున్న ఒప్పందాలేంటి? విద్యుత్ ఖర్చు పెట్టి నదుల నుండి రిజర్వాయర్లలోకి ఎత్తి పోసిన నీళ్లెన్ని? సరైన ప్రణాళిక లేకుండా వానా కాలంలోనే మళ్ళీ నదులలోకి తిప్పి పోసిన నీళ్ళెన్ని? వీటన్నిటికీ జవాబులు వెతకాలి. ఇక్కడి లాగానే దేశ వ్యాప్తంగా వేల కోట్ల అవినీతి చేయడానికి, కమీషన్లు సంపాదించడానికి, ఇక్కడి కాంట్రాక్టర్లను జాతీయ స్థాయికి తీసుకువెళ్లడానికి తప్ప ఈ రంగంలో మంచి అనుభవాలు ఏమున్నాయని? నీటి పారుదల ప్రాజెక్టుల కోసం సాగు భూములను బలవంతంగా సేకరించి , గ్రామాలను కూడా ఖాళీ చేయించిన ఈ ప్రభుత్వం, 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయకుండా , మొదట్లో 123 జీవోనూ, తరువాత 2016లో రాష్ట్ర స్థాయిలో మరో భూ సేకరణ చట్టాన్నీ తెచ్చి నిర్వాసితులకు అన్యాయం చేసింది.

పారిశ్రామిక ప్రాజెక్టుల పేరుతో, రంగారెడ్డి జిల్లాలో ఫార్మా సిటీ కోసం, జహీరాబాద్ ప్రాంతంలో ఎన్ఐఎంజెడ్ కోసం భూములను ఇదే పద్ధతిలో ప్రభుత్వం లాక్కుంటోంది. రీజనల్ రింగ్ రోడ్డు కోసం, జిల్లాలలో ఫుడ్ పార్కుల పేరుతోనూ భూములను కొల్లగొడుతోంది. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొన్న ఈ చేదు అనుభవాలనే జాతీయ స్థాయి ఎజెండాలోకి తీసుకు వెళతారా? వ్యవసాయ రంగంలో గొప్ప ముందడుగులు వేశామని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం సంక్షోభం నుండి రైతులను బయట పడేయక పోగా, నిజానికి మరింత సంక్షోభంలోకి నెట్టింది. రైతు బంధు పథకం సరిగా అమలు చేస్తే రైతులకు ఉపయోగపడే మంచి పథకం. రైతులను సంక్షోభం నుండి బయట పడేయడానికి ఈ పథకం తెచ్చామని మొదటి జీవోలో చెప్పుకున్నప్పటికీ, దాని ఉద్దేశ్యం పక్కదారి పట్టింది. వాస్తవ సాగు దారులుగా ఉన్న 20 లక్షల మంది కౌలు రైతులను గుర్తించకుండా, వారికి ఈ పథకం కింద ఒక్క రూపాయి కూడా సహాయం అందించకుండా, వారి ఆత్మహత్యలకు కారణమైంది. రైతు బీమా పథకం కూడా అంతే.. మొత్తం గ్రామీణ కుటుంబాలకు ఉపయోగ పడకుండా, కేవలం సొంత భూమి ఉన్న వారికే ఉపయోగ పడే పథకంగా ఉంది.

సాగు చేయని భూ యజమానులకు, సాగు చేయని రియల్ ఎస్టేట్ భూములకు రైతు బంధు సహాయం అందించి, వేల కోట్ల నిధులను ప్రతి సంవత్సరం దుర్వినియోగం చేస్తోంది ప్రభుత్వం. రైతు బంధు సహాయం చేస్తున్నాం అనే పేరున పంటల బీమా పథకాలను ఎత్తేసింది. పంట రుణాలపై వడ్డీ రాయితీ మానేసింది. యాంత్రీకరణ , విత్తన సబ్సిడీ పథకాలకు కోత పెట్టింది. రుణమాఫీ హామీని అమలు చేయడంలో వైఫల్యం రైతులను అప్పుల ఊబిలోకి దించింది. సంస్థాగత రుణ వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. పంటల బీమా పథకాలను పూర్తిగా నిలిపి వేసింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయినా రైతులకు ఒక్క రూపాయి కూడా సహాయం చేయడం లేదు. సన్న, చిన్నకారు రైతుల కోసం కాకుండా, పరోక్షంగా పెద్ద రైతులకూ, భూస్వాములకూ, వ్యవసాయేతర రియల్ ఎస్టేట్ యజమానులకూ సహాయం అందించడానికి అమలు చేస్తున్న ఈ పథకాన్ని జాతీయ స్థాయిలో కే‌సి‌ఆర్ భిన్నంగా అమలు చేస్తారా?

రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లయినా అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు రైతులకు ఈ ప్రభుత్వం పట్టాలు ఇవ్వలేదు. భూమి లేని దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి పథకాన్ని నామమాత్రంగా అమలు చేసి, ఇప్పుడు పూర్తిగా నిలిపి వేసింది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను చట్టం ఉన్నప్పటికీ కేటాయించిన దానిలో కనీసం సగం కూడా ఖర్చు చేయలేదు. పైగా చట్టం స్ఫూర్తికి భిన్నంగా ఆ నిధులను పక్కదారి పట్టించింది. జాతీయ స్థాయిలో కే‌సీ‌ఆర్ సామాజిక న్యాయం ఇలాగే ఉండబోతోందా? రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే చేసి, భూముల రీ సెటిల్ మెంట్ చేసి, 1973 భూ సంస్కరణల చట్టం ప్రకారం మిగులు భూములను తేల్చి, భూమి లేని పేదలకు పంచడానికి అసలు చర్చే చేయని కే‌సీఆర్.. పాస్ బుక్ చట్టంలో సవరణలు చేసి, దశాబ్ధాలుగా రికార్డులలో ఉన్న కౌలు రైతులను తొలగించారు. రాష్ట్ర రైతుల రెవెన్యూ రికార్డులను తారు మారు చేసి మొత్తం రెవెన్యూ వ్యవస్థను “ధరణి” పేరుతో అతలాకుతలం చేశారు. జాతీయ స్థాయిలో భూసంస్కరణల ఎజెండాను చేపడతారా? రెవెన్యూ వ్యవస్థను బాగు చేస్తారా? ఒక రాష్ట్రం అభివృద్ధి చెందడానికి , ఆ రాష్ట్ర విద్యా రంగం కీలక పాత్ర పోషిస్తుంది. కానీ మన రాష్ట్ర విద్యా రంగం, ముఖ్యంగా ప్రాథమిక విద్యారంగం మరణ శయ్యపై ఉందని సోషల్ డెమాక్రటిక్ ఫోరం(SDF) నివేదిక తేల్చి చెప్పింది. కే‌జీ నుండి పీజీ వరకు ఉచిత విద్యా బోధన పథకం ఎంతగా అమలయ్యిందో మనం చూస్తూనే ఉన్నాం. లక్షల మంది నిరుద్యోగులకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఎట్లా అటకెక్కిందో, ఏడు వేల మంది రైతుల ఆత్మహత్య బాధిత కుటుంబాలు పరిహారం కోసం ఎంతగా ఎదురు చూస్తున్నాయో తెలుసు. మరి ఈ రాష్ట్ర ప్రజల కన్నీళ్ళనే జాతీయ స్థాయి ఎజెండాగా కే‌సీ‌ఆర్ మారుస్తారా? రాష్ట్రాన్ని మద్యం వాడకంలో అగ్రస్థానానికి తీసుకువెళ్లి, మద్యం పన్నుల ఆదాయంపై మొత్తం సంక్షేమ పథకాలను నడిపిస్తున్న కేసీఆర్ రేపు దేశానికి కూడా ఈ అంశంలో ఆదర్శంగా నిలుస్తారా? అందుకే ఈ దశలోనే మనం జాగరూకులై ఉండాలి. బీజీపీ మతతత్వ ఎజెండాను నిలువరించాల్సిందే. అదే సమయంలో ప్రస్తుత ప్రభుత్వ నియంత పాలనను కూడా ఓడించాలి. మనం కోరుకోవాల్సింది ప్రజాస్వామిక పాలనను. బలమైన ప్రజాస్వామిక ఉద్యమాల నిర్మాణంతో మాత్రమే అది సాధ్యం.

Primary Sidebar

తాజా వార్తలు

అభిమానులను అలరిస్తున్న ఆదిపురుష్ అప్ డేట్ …!

మరో మాలీవుడ్ రీమేక్ కి… సై అంటున్న షాహిద్ కపూర్..!

రైళ్లే కదాని రాళ్లు విసిరితే శిక్ష ఏరేంజ్ లో ఉంటుందో తెలుసా..!

దేశంలోనే తొలిసారిగా న్యాయవ్యవస్థలోకి అడుగుపెట్టిన చాట్ జీటీపీ…!

రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా జంట ఓ ఇంటిదవుతుందట…!

నల్లకోటులో రవితేజ నటవిశ్వరూపం ‘రావణాసుర’..ట్రైలర్ టెర్రిఫిక్ గా ఉంది..!

కాంగ్రెస్ లో బయట పడిన అంతర్గత కుమ్ములాటలు..!

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా… వరల్డ్ రికార్డ్ కొట్టిందంట..!

లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాపై విపక్షాల అవిశ్వాస తీర్మానం ?

30 రోజుల పాటు ‘జై భారత్ సత్యాగ్రహం’.. పోరాటాన్ని ఉదృతం చేస్తున్న కాంగ్రెస్..!

ఆస్కార్ తర్వాత మన కీరవాణి మంచం దిగటం లేదట…కారణం ఏంటంటే..!?

అనర్హత కేసులో ఎన్సీపీ నేత.. రేపు సుప్రీం విచారణ

ఫిల్మ్ నగర్

అభిమానులను  అలరిస్తున్న  ఆదిపురుష్  అప్ డేట్ ...!

అభిమానులను అలరిస్తున్న ఆదిపురుష్ అప్ డేట్ …!

మరో మాలీవుడ్ రీమేక్ కి... సై అంటున్న షాహిద్ కపూర్..!

మరో మాలీవుడ్ రీమేక్ కి… సై అంటున్న షాహిద్ కపూర్..!

రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా  జంట  ఓ ఇంటిదవుతుందట...!

రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా జంట ఓ ఇంటిదవుతుందట…!

నల్లకోటులో రవితేజ నటవిశ్వరూపం ‘రావణాసుర’..ట్రైలర్  టెర్రిఫిక్ గా  ఉంది..!

నల్లకోటులో రవితేజ నటవిశ్వరూపం ‘రావణాసుర’..ట్రైలర్ టెర్రిఫిక్ గా ఉంది..!

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా... వరల్డ్ రికార్డ్  కొట్టిందంట..!

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా… వరల్డ్ రికార్డ్ కొట్టిందంట..!

ఆస్కార్ తర్వాత మన కీరవాణి మంచం దిగటం లేదట...కారణం ఏంటంటే..!?

ఆస్కార్ తర్వాత మన కీరవాణి మంచం దిగటం లేదట…కారణం ఏంటంటే..!?

మల్టీస్టారర్లో మరోసారి మెరవనున్న మాస్ మహరాజా...!?

మల్టీస్టారర్లో మరోసారి మెరవనున్న మాస్ మహరాజా…!?

mega daughter in law upasana baby bump photos goes viralin social media

బేబి బంప్‌ తో ఉపాసన..అందరి అనుమానాలు తీరినట్లేనా?

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap