ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ లో ట్రాక్టర్ బోల్తా పడి 26 మంది మృతి చెందారు. ఈ ప్రమాదం గురించి ప్రత్యక్ష సాక్షులు కొన్ని వివరాలను తెలియజేశారు. ట్రాక్టర్ డ్రైవర్ మద్యం మత్తులో ట్రాక్టర్ ను అతివేగంతో నడిపినట్లు తెలిపారు.
మత్తులో ఉండటం వల్ల ట్రాక్టర్ ని సరిగా హ్యాండిల్ చేయలేకపోయాడని అందువల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు తెలిపారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు సంఘటనా స్థలానికి కొందరు స్థానికులు చేరుకున్నారు. కానీ వారు సహాయక చర్యలు అందించకపోగా ప్రమాద ఘటనను, చనిపోయిన వారిని, గాయపడిన వారిని వారి సెల్ ఫోన్లలో వీడియోలు తీసుకుంటున్నారని వారు తెలిపారు.
ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 26 మంది మృతి చెందగా, 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారందరిని కాన్పూర్ లోని హలత్ ఆసుపత్రికి తరలించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆసుపత్రికి చేరుకొని క్షతగాత్రులను , వారి కుటుంబాలను పరామర్శించారు.
దీంతో పాటు చికిత్సకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను యోగి ఆదేశించారు. యోగితో పాటు అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా కూడా కాన్పూర్‌లోని ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు.