రిషబ్ షెట్టి స్వయంగా దర్శకత్వం వహించి, హీరోగా నటించిన సినిమా కాంతార. ఈ సినిమాకు కథ కూడా అతడే రాసుకున్నాడు. ఎలాంటి అంచనాల్లేకుండా, ఓ కన్నడ సినిమాగా వచ్చిన కాంతార, జాతీయ స్థాయిలో సూపర్ హిట్టయింది. పాన్ ఇండియా లెవెల్లో సంచలనం సృష్టించింది.
ఈ సినిమాతో ఊహించని విధంగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు రిషబ్ శెట్టి. కాంతార ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పుడీ సినిమాకు పార్ట్-2 తీయడానికి రెడీ అవుతున్నాడు రిషబ్. ఈ మేరకు హోంబలే ఫిలిమ్స్ సంస్థ, ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు, చాలా వివరాలు వెల్లడించింది.
కాంతార-2 అనేది సీక్వెల్ కాదు. ఇదొక ప్రీక్వెల్. అంటే కాంతార ఎక్కడ మొదలైందో, అక్కడ ఈ సినిమా ఎండ్ అవుతుందన్నమాట. ఓ అడవి, అందులో ఓ గ్రామం, మహారాజుకు ఆత్మసంతృప్తి లాంటి అంశాలతో కాంతార-2 నడుస్తుంది. ఇంకా చెప్పాలంటే.. బాహుబలి రిలీజైన తర్వాత శివగామి మీద సిరీస్ వచ్చినట్టన్నమాట.
పార్ట్-2కు కూడా అజనీష్ సంగీతం అందించబోతున్నారు. అంతేకాదు, వరాహరూపం పాటను కూడా యథాతథంగా ఉంచబోతున్నారు. కాకపోతే ఈసారి పూర్తిగా కన్నడ నటుడులతో కాకుండా.. అన్ని భాషలకు కనెక్ట్ అయ్యే నటీనటుల్ని తీసుకుంటున్నారు.