ఒకోసినిమా నవ్విస్తుంది.ఒకోసినిమా ఏడిపిస్తుంది. ఒకోసినిమా ఆలోచింపజేస్తుంది.కానీ ఇటీవల విడుదలైన “కాంతారా” ..సినిమా మాత్రమే కాదు ఓ సంచలనం. మరుగున పడుతున్న మట్టిపరిమళాన్ని,సాంస్క్రుతిక కళారూపాన్ని, ఆధ్యాత్మిక విశ్వాన్ని, పర్యావరణ ప్రాముఖ్యతనీ కలబోతగా ప్రేక్షకులకు కనువిందు చేసింది.ఇక కలెక్షన్లు రికార్డుల సంగతి చెప్పాల్సిన పనిలేదు. తెలుగు,కన్నడ,మళయాళ,హిందీ వంటి భాషల్లో రిలీజ్ అయ్యి ప్రేక్షక లోకాన్ని ఉర్రూతలూపింది. కాంతారా సినిమా స్థాయిని కల్ట్ క్లాసిక్ గా నిలిపిన కీర్తన గురించి ప్రత్యేకంగా చెప్పాలి. శాస్త్రీయ సంగీతానికి,వెష్ట్రన్ ఫ్యూజన్ జోడించి అందరి హ్రుదయాల్లోకి చొచ్చుకుపోయేలా చేసారు. ఈ కీర్తన సినిమాకు థీమ్ సాంగ్ గా ఉపయోగించి శాస్త్రీయ సంగీత మాధుర్యాన్ని ప్రేక్షకలోకానికి రుచి చూపించారు.
ఈ నేపథ్యంలో ఓ తహసీల్దార్ వరాహరూపం అనే ఈ థీమ్ సాంగ్ కు తగ్గట్టు వేషం వేసి, అనుకరించిన డ్యాన్స్ అందర్నీ ఆకట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయంలో ఇటీవల జరిగిన పన్నుల శాఖ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ క్రమంలో కొత్తవలస తహసీల్దార్ ప్రసాద రావు కాంతార సినిమాలో హీరో రిషబ్ శెట్టి చేసిన పాత్ర తరహాలో వేషం వేశారు. అదే తరహాలో సాంగ్ కు అద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చి వీక్షకులను మంత్రముగ్ధులను చేసారు.
కాగా కాంతార సినిమా పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేసిన ప్రసాదరావు మొదటిబహుమతి గెలుచుకున్నందుకు గానూ నెటిజన్లు ఆయనకు అభినందనలు చెబుతున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన తహసీల్దార్ ప్రసాద రావుకు కళలంటే ఎంతో ఆసక్తి ఉండడంతో అందరిలాగానే ఇతనూ పాల్గొని, మంచి తహసిల్దార్ గానే కాక కాంతార ప్రసాదరావుగా గౌరవాన్ని పలువురి మన్ననల్ని గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. గత కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ ఈవెంట్ లో ప్రసాద రావు చేసిన డ్యాన్స్ కు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమ్ముదులుపుతుంది.