– రాజ్యసభకు హర్యానా హరికేన్?
– రాష్ట్రపతి కోటాలో బీజేపీ ఆఫర్?
– రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ
కపిల్ దేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. 1983లో భారత్ కు తొలిసారి వరల్డ్ కప్ అందించారు. క్రికెట్ లో ఎన్నో రికార్డులు క్రియేట్ చేశారు. హర్యానాకు చెందిన కపిల్ ప్రస్తుతం క్రికెట్ కు సంబంధించిన కార్యక్రమాల్లోనే పాల్గొంటూ ఉంటారు. రాజకీయ కార్యక్రమాల్లో ఆయన కనిపించింది లేదు. కానీ.. ఆ పార్టీలో చేరుతున్నారు.. ఇందులో జాయిన్ అవుతున్నారని ఎప్పుడూ ఆయనపై వార్తలు వస్తూనే ఉంటాయి. తాజాగా మరో విషయంపై ఆయన పేరు మార్మోగుతోంది.
కపిల్ దేవ్ రాష్ట్రపతి కోటా కింద ఖాళీ అయ్యే 4 స్థానాల నుండి బీజేపీ తరఫున రాజ్యసభకు వెళ్తారని ప్రచారం జరుగుతోంది. దీనికోసం బీజేపీ నేతలు సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. కపిల్ కు అటు కాంగ్రెస్, ఇటు బీజేపీతో మంచి సంబంధాలే ఉన్నాయి. అందుకే అప్పుడప్పుడు కాంగ్రెస్ లో చేరుతున్నారని.. లేదు లేదు బీజేపీ కండువా కప్పుకుంటారని అనేక కథనాలు వండి వార్చింది జాతీయ మీడియా.
ఇటు ఆప్ లో కూడా చేరుతున్నారని వార్తలు వచ్చాయి. హర్యానాలో 2024లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ కొద్దిరోజుల క్రితం కపిల్ ను కలిశారు. దీంతో ఆప్ లో చేరికకు సర్వం సిద్ధమయ్యాయని ప్రచారం సాగింది. కానీ.. కపిల్ ఈ వార్తలను పూర్తిగా ఖండించారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదన్నారు. తాను ఎప్పుడైనా ఇంత పెద్ద అడుగు వేస్తే బహిరంగంగా ప్రకటిస్తానని అన్నారు.
కపిల్ రాజకీయ ప్రవేశంపై క్లారిటీ ఇచ్చినా కూడా రూమర్స్ ఆగలేదు. ప్రస్తుతం ఆయన బీజేపీ తరఫున రాజ్యసభకు వెళ్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరి.. దీనిపై ఆయన ఎలా స్పందించారనేది చూడాలి.