పాకిస్తాన్ లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. క్వెట్టా నుంచి కరాచీకి 48 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్యాసింజర్ బస్సు ఆదివారం ఉదయం బెలూచిస్థాన్ లోని లాస్ బెలా వద్ద మలుపు తిరుగుతూ ఓ లోయలో పడిపోయింది. పడిన వెంటనే వాహనానికి నిప్పంటుకుని మంటల్లో మండిపోయిందని, ఈ దుర్ఘటనలో 41 మంది మరణించారని పాక్ మీడియా తెలిపింది.
అత్యధిక వేగం వల్లే ఈ యాక్సిడెంట్ జరిగినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారని పేర్కొంది. ఈ దుర్ఘటన సమయంలో బస్సు డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్నాడని కూడా తెలుస్తోంది.
ఈ ఘటనలో కొందరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడడంతో మృతుల సంఖ్య పెరగవచ్చునని భావిస్తున్నారు. ఓ చిన్నారిని, ఓ మహిళతో సహా ముగ్గురిని రక్షించినట్టు లాస్ బెలా అసిస్టెంట్ కమిషనర్ హంజా అంజుమ్ తెలిపారు.
మధ్యాహ్నం ఒంటి గంటవరకు 17 మృతదేహాలను వెలికి తీశారని ఆయన చెప్పారు. ప్రమాదకరమైన మలుపులున్న ఈ ప్రాంతంలో వాహనాలను జాగ్రత్తగా నడపవలసి ఉంటుందని అన్నారు.