ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ప్రపంచాన్ని అంతా ఊపేసి ఆస్కారం అవార్డు సాధించిన సంగతి తెలిసిందే. సినిమా రిలీజయి సంవత్సరం అవుతున్నా నాటు నాటు అంటూ అందరూ ఊగిపోతూనే ఉన్నారు. ఇటీవలే ఆస్కార్ గెలుచుకొని ఆర్ఆర్‌ఆర్ టీం ఇండియాకు వచ్చింది.
ఇండియాలో ఆర్‌ఆర్‌ఆర్ టీంకు గ్రాండ్ వెల్కమ్ లభించింది. ఇక నాటు నాటు సాంగ్ ని అందరూ ప్రశంసిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆస్కార్ కూడా రావడంతో టీంకు అందరూ అభినందనలు తెలియచేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటి కరీనా కపూర్ నాటు నాటు సాంగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కరీనా హోస్ట్ గా వాట్ ఉమెన్ వాంట్ అనే ఓ షో చేస్తున్న సంగతి తెలిసిందే.
తాజా ఎపిసోడ్ లో కరీనా నాటు నాటు గురించి మాట్లాడింది. కరీనా కపూర్ మాట్లాడుతూ.. నాటు నాటు పాట చరిత్ర సృష్టించింది. చిన్న పిల్లల మనసు సైతం ఈ పాట కొల్లగొట్టింది. నా చిన్న కొడుకు జెహ్ నాటు నాటు పాట పెడితే కానీ అన్నం తినట్లేదు. అది కూడా తెలుగులోనే వినడానికి ఇష్టపడుతున్నాడు. జెహ్ కి ఆ పాట బాగా నచ్చింది. ఆ పాట వినపడినప్పుడల్లా సంతోషంతో డ్యాన్స్ చేస్తున్నాడు.
ఆస్కార్ గెలిచిన పాట ప్రేక్షకులని ఎంతగా మ్యాజిక్ చేసిందో ఇదే ఉదాహరణ అని తెలిపింది. దీంతో కరీనా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. నాటు నాటు పాట వినపడందే తన కొడుకు అన్నం తినట్లేదు అనడంతో ఆశ్చర్యపోతున్నారు. ఇక చరణ్, ఎన్టీఆర్ అభిమానులు ఈ వ్యాఖ్యలని వైరల్ చేస్తున్నారు.