విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించారు ప్రముఖులు. ఆనాటి విజయాన్ని గుర్తు చేసుకుంటూ సైనికుల సేవలను కొనియాడారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైనికుల ధైర్య సాహసాలు, సంకల్పానికి విజయ్ దివస్ ప్రతీక అని అన్నారు. మాతృభూమి కోసం ప్రాణ త్యాగం చేసిన వారికి శిరసు వంచి నమస్కరిస్తున్నానని ట్వీట్ చేశారు.
మన సైనికులు కార్గిల్ యుద్ధ సమయంలో తిరుగులేని దేశ భక్తి, అసమాన శౌర్యాన్ని ప్రదర్శించారంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు. భరత మాత కీర్తి, ప్రతిష్టలకు కార్గిల్ విజయ్ దివస్ ప్రతీక అని అన్నారు ప్రధాని మోడీ. ఈ సందర్భంగా మాతృభూమి రక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న సైనికులకు శతకోటి వందనాలు తెలిపారు.
రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అమరవీరులకు పుష్పాంజలి ఘటించారు. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సైనిక దళాధిపతి జనరల్ మనోజ్ పాండే, చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ రాధాకృష్ణన్ హరికుమార్, వాయుసేన చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి కూడా పాల్గొన్నారు.
1999 మే 3 నుంచి జులై 26 వరకు కార్గిల్ యుద్ధం జరిగింది. కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలో పాకిస్తాన్ దురాక్రమణకు పాల్పడింది. దీంతో భారత్ యుద్ధానికి దిగింది. పాక్ బలగాల వెన్నులో వణుకు పుట్టేలా చేసింది. కార్గిల్ మొత్తం వైశాల్యం 14,086 చదరపు కిలోమీటర్లు. ఇది శ్రీనగర్ నుండి లేహ్ వైపు 205 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆనాటి యుద్ధం జూలై 26న ముగయడంతో ఆ రోజును కార్గిల్ విజయ్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం.