కరీంనగర్ కారు ప్రమాదంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేసి పలు కీలక విషయాలు వెల్లడించారు. మొత్తం నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ ప్రమాదానికి కారణమైన వారు మైనర్లు అని పోలీసులు తెలిపారు. కారు యజమాని రాజేంద్రప్రసాద్ తోపాటు మరో ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకున్నామని కరీంనగర్ సీపీ సత్యనారాయణ తెలిపారు.
ప్రమాద సమయంలో కారులో రాజేంద్రప్రసాద్ కుమారుడుతో పాటు.. మరో ఇద్దరు మైనర్లు ఉన్నారని చెప్పారు. కారు అదుపు తప్పుప్పినపుడు కంట్రోల్ చేయడానికి.. బ్రేక్ బదులు, క్లచ్ తొక్కడంతో ఈ దుర్ఘటన జరిగిందని సీపీ అన్నారు. ముందుగా రాజేంద్ర ప్రసాద్ తానే కారు నడిపానని నమ్మించే ప్రయత్నం చేశాడని.. తరువాత విచారణలో మైనర్ బాలుడు డ్రైవ్ చేసినట్టు తేలిందన్నారు.
ముగ్గురు మైనర్లపై యాక్సిడెంట్ కేసు కాకుండా హత్య కేసు నమోదు చేశామని అన్నారు. దాంతో పాటు మైనర్లకు కారు ఇవ్వడం వలన రాజేంద్ర ప్రసాద్ పై కూడా కేసు నమోదు చేశామని అన్నారు. కాగా.. ఈ రోజు ఉదయం కరీంనగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన కారు కమాన్ చౌరస్తా వద్ద రోడ్డు పక్కన సీస కమ్మరి వృత్తి చేసుకునే వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు చనిపోగా.. కొంతమందికి గాయాలు అయ్యాయి.
మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. మృతి చెందినవారిలో ఒకరు ఘటనా స్థలంలోనే చనిపోగా.. ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ప్రమాదం జరిగిన తరువాత కారును వదిలేసిన మైనర్ బాలురు పరారయ్యారు. కారుపై 9 ఓవర్ స్పీడ్ చలాన్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతిచెందిన వారిని ఫరియాద్, సునీత, లలిత, జ్యోతిలు అని పోలీసులు చెప్పారు.