కరీంనగర్ బీజేపీ కార్యాలయంలో ఉపాధ్యాయ ఉద్యోగులకు మద్దతుగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ జాగరణ దీక్ష చేపట్టారు. దీంతో ఆయన చేపట్టిన దీక్షలో కోవిడ్ నిబంధనలు పాటించలేదని పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. దీంతో ఈ ఘటన తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది.
కరీంనగర్ లో బండి సంజయ్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ.. బీజేపీ ఓబీసీ మోర్చా.. జాతీయ బీసీ కమిషన్ ను ఆశ్రయించింది. కరీంనగర్ సీపీ సత్యనారాయణ కావాలని అధికార పార్టీకి అనుగుణంగా వ్యవహరించారని ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో సీపీని.. తమ ముందు హాజరు కావాలని గత వారం క్రితం జాతీయ బీసీ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
అయితే.. బీసీ కమిషన్ ముందు సీపీ సత్యనారాయణ హాజరు కాలేదు. ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీ కమీషన్.. తదుపరి విచారణకు హాజరుకావాలని సూచించింది. దీంతో గురువారం బీసీ కమిషన్ ముందు ఆయన హాజరయ్యారు.
కొంత కాలం క్రితం జీవో 317 కారణంగా ఉపాధ్యాయ ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతోందని.. వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. కరీంనగర్ బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ శాంతియుత దీక్షను చేపట్టారు. దీంతో సంజయ్ తో పాటు.. బొడిగె శోభ ఇంకొంత మందిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.