అధికారులు, అధికార పార్టీ నేతలు ఎలా ఉంటారో మనకు తెలుసు. పైకి చెప్పుకోకున్నా.. ఒకరిపై ఒకరికి పడదు. ఏదో ఒక విషయంలో గొడవలు అవుతుంటాయి. లీడర్ ని కాదని అధికారులు చేసేది ఏమీ ఉండదు. ఒకవేళ చేసినా. తర్వాతి పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలియదు. ఒక్కోసారి వీళ్ల వివాదాలు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తాయి. తాజాగా ఓ అధికారిపై ఎంపీపీ భర్త ప్రవర్తన చర్చనీయాంశంగా మారింది.
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఎంపీపీ సులోచన చిన్న మీటింగ్ అరేంజ్ చేశారు. అయితే.. ఈ భేటీలో ఆమె భర్త ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. పంచాయితీ రాజ్ ఏఈ పై నీళ్ల బాటిల్ తో దాడి చేస్తూ ఆగ్రహంతో ఊగిపోయారు.
దీనికి కారణం ఏంటంటే.. వెల్ది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవన భూమి పూజా కార్యక్రమానికి సమయం కేటాయించడం లేదని ఇలా ప్రవర్తించారు. టేబుల్ పై ఉన్న బాటిల్ ను విసిరి కొట్టారు. దీంతో చిన్నపాటి ఉద్రిక్తత నెలకొంది.
ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. విషయం తెలిసి అధికారులు, ప్రజాప్రతినిధులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ప్రభుత్వ అధికారిపై దురుసుగా ప్రవర్తించడం ఏంటని అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది.