కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం బెంగుళూరులో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున నిరసనకు దిగారు. ఆందోళనకు దిగిన మాజీ సీఎం సిద్దరామయ్యతో సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యే విరూపాక్ష కుమారుడు ప్రశాంత్ మాదాల్ నిన్న రూ. 40 లక్షలు లంచం తీసుకుంటూ లోకాయుక్త అధికారులకు పట్టుబడిన ఉదంతం రాష్ట్రవ్యాప్త సంచలనం రేపింది.
అతని ఇంటి నుంచి అధికారులు రూ. 6 కోట్లకు పైగా నగదును, అతని కార్యాలయం నుంచి మరో 1.7 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇది సామాన్య విషయం కాదని, ఈ ఉదంతానికి నైతిక బాధ్యత వహించి సీఎం బసవరాజ్ బొమ్మై రాజీనామా చేయాలని సిద్దరామయ్య డిమాండ్ చేశారు.
రేస్ కోర్స్ రోడ్ లోని సీఎం నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో బెంగుళూరు సిటీలో శనివారం చాలాసేపు హైడ్రామా నడిచింది. మీది అవినీతిరహిత ప్రభుత్వమని బొమ్మై చాటుకుంటున్నారని, కానీ జరుగుతున్నదేమిటని సిద్దరామయ్య ప్రశ్నించారు. విరూపాక్షను అరెస్టు చేసి తీరవలసిందేనన్నారు. ప్రతి పనికి కాంట్రాక్టర్లు 40 శాతం కమీషన్ డిమాండ్ చేస్తున్నారని మేము ఆరోపిస్తున్నప్పుడల్లా మీరు ఆధారాలు చూపాలని కోరుతున్నారని, ఈ ఉదంతం మీకు చాలదా అని ఆయన బొమ్మైని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రతి రంగంలోనూ అవినీతి వ్యాపించిందన్నారు.
తమ నిర్వాకం బయటపడడంతో విరూపాక్ష నిన్న రాత్రి పదవికి రాజీనామా చేశారు. తనకు, లోకాయుక్త దాడులకు సంబంధం లేదని, ఇదంతా కుట్ర అని ఆయన సీఎంకు పంపిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అరెస్టు కాకుండా ఆయన యాంటిసిపేటరీ బెయిల్ కి యత్నించినట్టు తెలుస్తోంది.