కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మే 10న పోలింగ్ నిర్వహించనున్నట్టు కేంద్రం ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ తెలిపారు. ఏప్రిల్ 13న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
నామినేషన్ల దాఖలుకు ఏప్రిల్ 20 చివరి తేదీగా ఎన్నికల సంఘం ప్రకటించింది. నామినేషన్ల పరిశీలనకు ఏప్రిల్ 21 వరకు గడవు ఇచ్చింది. ఏప్రిల్ 24 వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చని చెప్పింది. మే13న ఎన్నికల ఫలితాలను ప్రకటించనుంది.
రాష్ట్రంలో మొత్తం 5.21 కోట్లు మంది ఓటర్లు ఉన్నట్టు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 58వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని చెప్పారు.
వాటిలో 36 ఎస్సీలకు, 15 ఎస్టీలకు రిజర్వు చేయబడ్డాయన్నారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 5,21,73,579 కోట్లు కాగా అందులో పురుషులు 2.62 కోట్లు, స్త్రీలు 2.59 కోట్లు ఉన్నారన్నారు. మొత్తం 80 ఏండ్లకు పైబడిన ఓటర్ల సంఖ్య 12.15 లక్షలు. 100 ఏండ్లకు పైగా ఉన్న ఓటర్లు 16,976 మంది ఉన్నారన్నారు.