కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ కొలువు దీరిన తర్వాత మొదటి సారిగా అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. కొత్త ఎమ్మెల్యేలు, కొత్త మంత్రులు, కొత్త ప్రతి పక్షంతో సభలో ఓ కొత్త వాతావరణం కనిపించింది. మొదటి రోజు సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్, మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై సహా 93 మంది ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు.
ఈ సమావేశాలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి. మొదటి రోజు అసెంబ్లీలో ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. అధికార కాంగ్రెస్ కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఎడ్లబండిపై వచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. మండ్య కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్ గౌడ గనిగతోపాటు మరికొందరు ఎమ్మెల్యేలు ఎద్దులబండిపై శాసనసభకు వచ్చారు.
రాష్ట్రంలో రైతు ప్రభుత్వం ఏర్పడినందుకు ప్రతీకగా ఎద్దుల బండ్లపై అసెంబ్లీకి వచ్చామని ఎమ్మెల్యేలు తెలిపారు. ఇక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ విధాన సౌధ మెట్లపై సాష్టాంగ నమస్కారం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు మాజీ సీఎం బసవరాజ్ బొమ్మైను డీకే మర్యాదపూర్వకంగా కలిశారు.
విధాన సౌధ ప్రాంగణాన్నిగోమూత్రంతో కాంగ్రెస్ నేతలు శుభ్రం చేయించారు. అనంతరం అసెంబ్లీ ప్రవేశ ద్వారం, బయట ప్రాంగణంలో కేపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎస్.మనోహార్ అర్చకులతో కలిసి పూజలు నిర్వహించారు. జాతీయ గీతం వందేమాతరం ఆలపించి అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించారు. ఈ సమావేశంలో నూతన ఎమ్మల్యేలతో ప్రొటెం స్పీకర్ ఆర్వీ దేశ్పాండే ప్రమాణం చేయించారు.
జేడీఎస్ నుంచి ఎన్నికైన జీటీ దేవెగౌడ, ఆయన కుమారుడు హరీశ్గౌడ్లు అసెంబ్లీలో పక్కపక్కనే కూర్చున్నారు. మంచి స్నేహితుల్లాగా వారిద్దరూ మాట్లాడుకోవడం అందరినీ ఆకర్షించింది. ఇక బీజేపీ హయాంలో అన్ని పనులకు 40 శాతం కమీషన్ తీసుకున్నట్లు కాంగ్రెస్ ఆరోపించిందని, వాటిని ఆధారాలతో నిరూపించాలని మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై డిమాండ్ చేశారు.