కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కర్ణాటక బీజేపీ చీఫ్ నవీన్ కతీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ నపుంసకుడని, అందువల్లే ఆయన పెళ్లి చేసుకోవడం లేదని అన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే వంధ్యత్వం వస్తుందని, సంసారానికి పనికి రాకుండా పోతారని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు.
రాహుల్ మారిటల్ స్టేటస్ ను ఆయన ప్రశ్నించారు. లోగడ కూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన.. ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో ప్రజలు.. రోడ్లు, మురుగు కాలువలు వంటి చిన్నపాటి సమస్యలను ప్రస్తావించే బదులు ‘లవ్ జిహాద్’ అంశానికి ప్రాధాన్యమివ్వాలన్నారు.
తమ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు టిప్పు సుల్తాన్, సావర్కర్ అంశాల మధ్యే జరగడం ఖాయమని నవీన్ కతీల్ జోస్యం చెప్పారు. రాహుల్ పై ఆయన చేసిన కామెంట్స్ పై మండిపడిన కాంగ్రెస్ నేతలు ఇలాంటి నోటి దురుసు గల వారిపై బీజేపీ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
తమ నేతపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. పైగా తానూ తక్కువ తినలేదన్నట్టు ఈ పార్టీ నేత రిజ్వాన్ అర్షద్.. ప్రధాని మోడీ ఎందుకు విడాకులు తీసుకున్నారని ప్రశ్నించారు. కొంతమంది ఆర్ఎస్ఎస్ నేతలు కూడా పెళ్లి చేసుకోకుండా అవివాహితులుగా గడపడం లేదా అన్నారు.