కర్ణాటకలో అవినీతి కేసుకు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్పకు రాష్ట్ర హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసులో ఆయన ఇన్వెస్టిగేటింగ్ అధికారి ముందు హాజరు కావాలని ఆదేశించింది. రూ. 40 లక్షల లంచం తీసుకుంటూ తన కొడుకు ప్రశాంత్ మాదాల్.. లోకాయుక్త అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినప్పటి నుంచి ఈయన పరారీలో ఉన్నాడు.
దావణగెరె జిల్లా చన్నగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న ఈయనపై కూడా అవినీతి కేసు నమోదైంది. గతవారం ప్రశాంత్ ఇంటి నుంచి సుమారు 6 కోట్లను, అతని కార్యాలయం నుంచి దాదాపు మరో 2 కోట్లను దాడుల సందర్భంగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రశాంత్ ని పోలీసులు అరెస్టు చేయగా.. విరూపాక్షప్పను ఈ కేసులో మొదటి నిందితునిగా పోలీసులు పేర్కొన్నారు.
కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జంట్స్ లిమిటెడ్ చైర్మన్ గా ఉన్న ఆయన .. ఈ నిర్వాకమంతా బయటకు పొక్కడంతో పదవికి రాజీనామా చేశారు. ఈ తండ్రీ కొడుకులు కర్ణాటక లో వివిధ చోట్ల భూముల కొనుగోళ్లలో భారీగా పెట్టుబడులు పెట్టినట్టుగా కూడా తెలిసింది.
వీరి ఇళ్ల నుంచి పెద్దఎత్తున బంగారు, వెండి నగలను సైతం స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. తనను అప్రదిష్ట పాల్జేసేట్టుగా వార్తలను గానీ, సమాచారాన్ని గానీ మీడియా సంస్థలు ప్రచురించకుండా వాటిని నిరోధించాలని కోరుతూ విరూపాక్షప్ప బెంగుళూరు లోని సివిల్ కోర్టుకు కూడా ఎక్కాడు.