కర్ణాటకలో అధికార బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కొడుకు ఒకరు తాజాగా లంచం తీసుకుంటు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. చేతులు తడపనిదే రాష్ట్రంలో ఏ పని జరగదనే ప్రభుత్వంపై విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. తాజాగా లంచం కేసులో ఎమ్మెల్యే పట్టుబడటంతో ప్రతిపక్షాలు విమర్శలకు పదును పెట్టాయి.
వివరాల్లోకి వెళితే.. కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ చైర్మన్ మండల్ విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ మండల్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఆయన తన కార్యాలయంలో రూ. 40 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.
అతని దగ్గర లభించిన మరో రూ.కోటీ 40 లక్షలను అధికారులు సీజ్ చేశారు. అనంతరం ఆయన నివాసంలో తనిఖీలు నిర్వహించారు. అక్కడ రూ. 6 కోట్లు లభించాయి. దీంతో ఆయన్ని పోలీసులు అరెస్టు చేశారు. తన తండ్రి తరఫున ఆయన లంచం తీసుకున్నట్టు తేలిందని ఏసీబీ వెల్లడించింది.
అతనికి ఇంత నగదు ఎలా వచ్చిందనే విషయాన్ని తేల్చి పనిలో అధికారులు పడ్డారు. ఈ మేరకు త్వరలోనే ఆయనకు నోటీసులు జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో బసవరాజ్ బొమ్మై సర్కార్ పై విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి.