కర్ణాటకలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ప్రారంభం అయ్యాయి. త్వరలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం బసవరాజ్ బొమ్మై తన చివరి బడ్జెట్ ను ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
సమావేశాల సందర్బంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. 2018 ఎన్నికల సమయంలో మెనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ విఫలమైందని ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు వినూత్నరీతిలో నిరసనకు దిగారు.
ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అదనంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు చూస్తున్నారు. దీంతో ఆయన బడ్జెట్ ను శాసన సభలో ఈ రోజు ప్రవేశపెట్టారు. ఆ సమయంలో కాంగ్రెస్ నేతలు తమ చెవిలో పువ్వు పెట్టుకుని సభకు హాజరయ్యారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సహా పలువురు నేతలు చెవిలో పూలు పెట్టుకుని సమావేశాల్లో కనిపించారు. ప్రభుత్వ తీరుపై సభలో నిరసన తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.