బెంగుళూరుకు చెందిన ఓ వ్యాపారవేత్త కారులోనే తనను తాను పిస్టల్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రదీప్ అనే ఈ బిజినెస్ మన్ తన సూసైడ్ కి బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావలితో బాటు మరో ఆరుగురు కారణమంటూ 8 పేజీల సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. అయితే అతని ఆత్మహత్యతో తనకు సంబంధం లేదని, ఈ నోట్ లో తన పేరు ఉన్నట్టు తెలిసిందని చెప్పిన లింబావలి.. ప్రదీప్ కి సంబంధించిన పలు విషయాలను వివరించాడు.
2010-2013 మధ్య తన సోషల్ మీడియాను ప్రదీప్ నిర్వహిస్తూ వచ్చాడని, ఆ కాలంలో ఓ బిజినెస్ వివాదాన్ని తన దృష్టికి తెచ్చాడని, దీన్ని మీరు, మీ పార్ట్ నర్స్ మీలో మీరు పరిష్కరించుకోవాలని తాను సలహా ఇచ్చానని ఆయన చెప్పారు. నువ్వు ఈ బిజినెస్ లో ఎంత పెట్టుబడి పెట్టావని గానీ.. మీ భాగస్థులు నీకెంత చెల్లించాలన్న వివరాలు గానీ తాను అడగలేదని అన్నారు.
కొన్ని రోజులకు ప్రదీప్ తనను కలిసి తనకు కృతజ్ఞతలు తెలిపాడన్నారు. అతడెందుకు సూసైడ్ చేసుకున్నాడో, సూసైడ్ నోట్ లో తనపేరును ఎందుకు ప్రస్తావించాడో తెలియదని ఆయన చెప్పారు. ‘ఒక దశలో తన భార్యకు అక్రమ సంబంధం ఉందని నాతో చెప్పాడు. అయితే నీ వ్యక్తిగత వివరాలు నాకు చెప్పవద్దని కోరాను’. అని లింబావలి పేర్కొన్నారు.
ఓ క్లబ్ లో పెట్టుబడి పెట్టాలని ప్రదీప్ ని అయిదుగురు వ్యక్తుల్లో ఇద్దరు ప్రోత్సహించారని, 2018 లో ఓపస్ అనే ఈ క్లబ్ లో ప్రదీప్ రూ. 1.5 కోట్లు పెట్టుబడి పెట్టాడని, నీకు 3 లక్షలు లాభాలు చూపుతామని, ప్రతినెలా ఒకటిన్నర లక్షల వేతనం వచ్చేలా చూస్తామని వారు ప్రలోభ పెట్టారని పోలీసువర్గాలు తెలిపాయి. కానీ ఎంతో కాలం గడిచినా అతనికి ఒక్క పైసా కూడా ముట్టలేదని తెలిసిందని పేర్కొన్నాయి. అయితే వీరితో ఎమ్మెల్యే లింబావలి కుమ్మక్కయినట్టు ప్రదీప్ ఆరోపించాడు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.