టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా లోకేశ్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో అస్వస్థతకు గురైన నందమూరి తారకరత్న పరిస్థితి విషమంగానే ఉంది. ఈ క్రమంలో ఆయనకు బెంగళూరులో చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. ఆయనను ఆసుపత్రిలో చేర్చిన దగ్గర నుంచి ఆయనతో పాటు ఆయన భార్య అలేఖ్య రెడ్డి, నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆయన వెంటే ఉండి ఎప్పటికప్పుడూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బెంగళూరు చేరుకొని తారకరత్న భార్యకు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వైద్యులను అడిగి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వైద్యులు ఆయనకు ఎక్మో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ఆయనకు మరో అరుదైన వ్యాధి కూడా ఉన్నట్లు వెల్లడించారు.
ఈ క్రమంలోనే తారకరత్నను చూసేందుకు బెంగళూరు నారాయణ హృదయాలకు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, నారా బ్రాహ్మణి, కళ్యాణ్ రామ్ భార్య స్వాతి, జూనియర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి కొద్ది సేపటి క్రితం బెంగళూరు చేరుకున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు ఆయన పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని చెప్పడంతో.. అవసరమైతే విదేశాల నుంచి వైద్యులను పిలిపించాలని వారు కోరినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా జూనియర్ ఎన్టీఆర్ బెంగళూరుకు వస్తున్న విషయం తెలియడంతో.. నారాయణ హృదయాలకు కర్నాటక ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్‌ను ముఖ్యమంత్రి బొమ్మై పంపించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు హెల్త్ కండీషన్ గురించి పూర్తి సమాచారం అందించాలని ఆయనను ముఖ్యమంత్రి ఆదేశించినట్లు సమాచారం.
మంత్రి తారక్, కళ్యాణ్ రామ్ తో మాట్లాడారు. ప్రస్తుతం తారకరత్న ఎక్మో సపోర్ట్‌పైనే ఉన్నారు. కార్డియాలజిస్ట్‌లు, ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్టుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోంది. అయితే, తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని చెబుతున్నారు. 48గంటలు గడిస్తేనే ఏమైనా చెప్పగలమంటున్నారు వైద్యులు.
కాగా జూనియర్ ఎన్టీఆర్‌కు కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్వతాహాగా అభిమాని. గతంలో కర్నాటక రాజ్యోత్సవ వేడుకలకు వెళ్లినప్పుడు తారక్‌కు రెడ్ కార్పెట్ పరిచారు. అంతేకాదు ఎన్టీఆర్‌ను స్వయంగా ఇంటికి ఆహ్వానించి.. సత్కరించి.. ఆతిథ్యం ఇచ్చారు.