వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కర్నాటకలో సీఎంను మారుస్తున్నారని అనేక వార్తలు వచ్చాయి. తర్వాత.. బొమ్మైను మార్చబోవడం లేదని అమిత్ షా స్పష్టం చేసినట్లుగా కథనాలు వచ్చాయి. కొద్దిరోజులుగా సైలెంట్ గా ఉన్న ఈ వ్యవహారం బొమ్మై ఢిల్లీ టూర్ తో మరోసారి చర్చనీయాంశంగా మారింది. బుధవారం ఢిల్లీలో కేంద్రమంత్రి అమిత్ షాను కలిశారు సీఎం బొమ్మై.
కేబినెట్ విస్తరణ అంశంపై చర్చించేందుకు అమిత్ షాను కలిసినట్లు అధికారికంగా చెబుతున్నా.. సీఎం మార్పు అంశంపైనే కలిసినట్లుగా తెలుస్తోంది. పైగా షాతో భేటీ తర్వాత బొమ్మై వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ”ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు.. రెండు రోజుల్లో పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది” అని అన్నారు బొమ్మై.
అమిత్ షాతో మంత్రివర్గ విస్తరణ సహా ఇతర అంశాలపైనా చర్చించినట్లు బొమ్మై అన్నారు. అంతేకాదు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ఇతర కేంద్ర నేతలతో మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటానని షా చెప్పినట్లు తెలిపారు. దీంతో ఆయన సీఎం మార్పు గురించి మాట్లాడారా? లేక.. కేబినెట్ విస్తరణ గురించి అన్నారా? అనే చర్చ జరుగుతోంది.
నిజంగా సీఎం మార్పు అయితే.. ముందునుంచి వినిపిస్తున్న పేరు శోభా కరంద్లాజే. ఈమె ప్రస్తుతం కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రిగా పని చేస్తున్నారు. మాజీ సీఎం యడియూరప్ప హయాంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆయనకు అత్యంత నమ్మకస్తురాలుగా ఈమెను చెబుతుంటారు. వీరిద్దరూ రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి. కోస్తా కర్నాటకలోని పుత్తూరుకు చెందిన శోభ ఆర్‌ఎస్‌ఎస్ లోనూ పని చేశారు. 2008లో బెంగళూరులోని యశవంతపుర నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. యడియూరప్ప ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ మంత్రిగా పని చేశారు. మంచి అడ్మినిస్ట్రేటర్ గా గుర్తింపు ఉంది.
ప్రస్తుతం ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై ఉన్నారు. గతేడాది జులై 28న ఈయన సీఎంగా ప్రమాణం చేశారు. లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన బొమ్మై.. జనతాదళ్ పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. షిగ్గావ్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎన్నికయ్యారు. 2008లో బీజేపీలో చేరారు. బొమ్మైకి ముందు యడియూరప్ప సీఎంగా కొనసాగారు. 2019 జులై 26 నుంచి 2021 జులై 27 వరకు పనిచేశారు. కర్నాటకలోని 20 శాతం ఓట్లు ఉన్న లింగాయత్ సామాజిక వర్గంలో బలమైన నేత. ప్రస్తుత ముఖ్యమంత్రి బొమ్మై కూడా లింగాయత్ సామాజికవర్గానికి చెందినవారు. ఆ వర్గం ఓట్లు అధికశాతం బీజేపీకే పడుతుంటాయి.
ఇక రాష్ట్రంలో మరో కీలక సామాజికవర్గం వక్కళిగ. వీరు 12 శాతం వరకు ఉన్నారు. జేడీఎస్ పార్టీకి ప్రధాన బలం ఈ సామాజికవర్గమే. ప్రతీ ఎన్నికలకు జేడీఎస్ వల్లే బీజేపీకి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో వక్కళిగ సామాజికవర్గంపై దృష్టి సారించిన అధిష్టానం దానికి చెందిన నేతనే సీఎం చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బీజేపీలో వక్కళిగ సామాజికవర్గానికి చెందిన కీలక నేత ఎవరంటే.. వెంటనే శోభా కరంద్లాజేనే గుర్తుకొస్తారు. వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే.. శోభను రంగంలోకి దింపాలని బీజేపీ అధిష్టానం డిసైడ్ అయినట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
యడియూరప్పకు నమ్మకస్తురాలు కావడంతో బొమ్మైని మార్చినా లింగాయత్ సామాజికవర్గం నుంచి ఎలాంటి సమస్య ఉండదనే భావనలో బీజేపీ ఉన్నట్లుగా చెబుతున్నారు విశ్లేషకులు. అదీగాక.. వక్కళిగలు తమకు యాడ్ అయితే విజయం పక్కా అని గట్టిగా ఫిక్స్ అయి శోభాను సీఎం చేయాలని చూస్తున్నారని అంటున్నారు.