పెట్రోల్ బంక్ వద్ద భార్యలు మారిపోయిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కర్నాటకలోని హావేరి జిల్లా రాణేబెన్నూరులో ఈ ఘటన చోటు చేసుకోగా.. నెటిజన్లు ఈ వార్తపై ఫన్నీగా కామెంట్ చేస్తూ షేర్ చేస్తున్నారు. వేరొకరి భార్యని బైక్ ఎక్కించుకున్న వ్యక్తి.. దాదాపు తన ఇంటికి తీసుకెళ్లబోయాడు.
మరోవైపు పెట్రోల్ బంక్ వద్దే ఆ బైక్ నడిపే వ్యక్తి భార్య, బైక్ వెనుక కూర్చున మహిళ భర్త వెయిట్ చేస్తూ కనిపించారు. ఈ ఘటన తెలిసిన తర్వాత అందరూ నవ్వులే నవ్వులు. ఇంతకీ ఏం జరిగిందంటే? భార్యతో కలిసి బండికి పెట్రోలు పోయించుకునేందుకు బంక్ వద్దకి వెళ్లిన వ్యక్తి.. తన భార్యని దిగి అక్కడే ఉండమని క్యూలోకి వెళ్లాడు. తర్వాత పెట్రోల్ కొట్టించుకుని అక్కడే నిలబడి ఉన్న మహిళను బండి ఎక్కమన్నాడు.
పిలిచింది తన భర్తే అని ఆమె బైక్ ఎక్కింది. కానీ కొంత దూరం వెళ్లాక ‘ఏమండీ.. మన ఇల్లు ఇటు కాదు కదా..? ఇటు వైపు ఎందుకు తీసుకువెళుతున్నారు?’ అని వెనుక నుంచి ఆమె అడిగింది. దాంతో ఏంటీ నా భార్య ఇలా మాట్లాడుతోందని వెనక్కు తిరిగి చూస్తే వెనుక కూర్చున్నావిడ తన భార్య కాదని తెలుసుకుని, నాలుక కరచుకున్నాడు.
తన భార్య ధరించిన రంగు చీరే కట్టుకుని ఉండడంతో బైకు ఎక్కినావిడ తన భార్యే అని ఆయన అనుకున్నారు. భర్త లాంటి బైకు.. అదే సౌష్ఠవం.. తెల్ల చొక్కా.. ఒకే రంగు హెల్మెట్ ఉండడంతో ఆమె కూడా తన భర్తే అని పొరపాటు పడింది. జరిగిన పొరపాటు అర్థమైన కొన్ని నిమిషాలలోనే ఆయన తిరిగి ఆమెను పెట్రోలు బంకు దగ్గరకు తీసుకు వచ్చాడు. అప్పటికే ఆయన భార్య, ఆమె భర్త అక్కడ వేచి చూస్తూ ఉన్నారు. హెల్మెట్ కారణంగా పొరపాటు జరిగిందని తెలుసుకుని వారితో పాటు, బంకులో ఉన్న వారూ పడిపడి నవ్వుకున్నారు.