తరగతి గదుల్లో హిజాబ్ ధరించే అంశానికి సంబంధించి దాఖలైన పిటిషన్ పై కర్ణాటక హైకోర్టు విచారణ చేపట్టింది. హిజాబ్ ధరించకుండా ఆదేశించే అధికారం విద్యాసంస్థలకు ఉందా అన్న అంశంపై ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల బెంచ్ విచారణ జరిపింది.
శుక్రవారం నుంచి విద్యాసంస్థలు తెరవాలని సూచించింది హైకోర్టు. డ్రెస్ కోడ్ పై ఎవరూ బలవంతం చేయొద్దని కీలక తీర్పునిచ్చింది. ఈ క్రమంలో హిజాబ్ వివాదంపై మద్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ.. విచారణ సోమవారానికి వాయిదా వేసింది.
ఈ కేసును త్రిసభ్య ధర్మాసనానికి హైకోర్టు బుధవారం రిఫర్ చేసింది. ముస్లిం పర్సనల్ లా లోని కొన్ని అంశాల దృష్ట్యా ఈ విషయాలు ప్రాథమిక ప్రాముఖ్యత కలిగిన కొన్ని రాజ్యాంగపరమైన ప్రశ్నలను సంధిస్తున్నాయి అని హైకోర్టు పేర్కొంది.
ఈ పిటిషన్ ను హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు ధర్మాసనానికి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం గురువారం ఉదయం తోసిపుచ్చింది. ముందుగా ఈ విషయంలో హైకోర్టులో విచారణ జరగనివ్వండని పిటిషనర్లకు సూచించింది.
ఇటీవల ఉడిపిలోని ప్రభుత్వ పాఠశాలలో హిజాబ్ ధరించిన ముస్లిం అమ్మాయిలకు ప్రవేశాన్ని నిరాకరించారు. అధికారుల తీరుపై ముస్లిం అమ్మాయిలు నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు కొంత మంది ముస్లిం విద్యార్థినులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.