కర్ణాటకలో హిజాబ్ నిషేధం పై సుప్రీంకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు తీర్పులు వెలువరించారు. ఈ నేపథ్యంలో ఈ వివాదం ఎటూ తేలకపోవడంతో రాష్ట్రంలో హిజాబ్ నిషేధం కొనసాగుతుందని భావిస్తున్నారు. దీనిపై భిన్న తీర్పులు వెలువడిన దృష్ట్యా ఈ అంశాన్ని సీజేఐ జస్టిస్ యూ.యూ. లలిత్ నేతృత్వం లోని ధర్మాసనానికి నివేదించనున్నారు. తన విచక్షణాధికారాలను ఉపయోగించి ఆయన ముగ్గురు లేదా నలుగురు న్యాయమూర్తులతో కొత్త బెంచ్ ని ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతానికి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ నోటిఫికేషన్ యధావిధంగా ఉంటుందని, సర్కార్ విద్యా సంస్థల్లో ఎలాంటి మార్పులు చేయవలసిన అవసరం లేదని అంటున్నారు.
ఏది ఏమైనా స్కూళ్లలో విద్యార్థులు యూనిఫారాలు కాకుండా హిజాబ్ లేదా మరే ఇతర డ్రెస్సులు ధరించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని బీజేపీ నేతలు తెలిపారు. వేర్పాటువాదాన్ని ప్రమోట్ చేయడానికి మత స్వేచ్ఛను వినియోగించుకోరాదని ఈ పార్టీ నేత సి.టి. రవి అన్నారు. యూనిఫారాలు సమైక్యతకు నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు.
కోర్టు తీర్పులపై తానేమీ వ్యాఖ్యానించబోనని, తానెప్పుడూ ‘సెపరేటిస్ట్ మైండ్ సెట్’ ని వ్యతిరేకిస్తానని ఆయన చెప్పారు. మరి హిజాబ్ అంశంపై విస్తృత ధర్మాసనం ఏం చెబుతుందో చూడాలని ప్రభుత్వ వర్గాలు, నిషేధాన్ని వ్యతిరేకిస్తున్నవారు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.