కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేగింది. ఆ రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ ధర్మే గౌడ బలవన్మరణానికి పాల్పడ్డారు. చిక్కమగళూరు జిల్లా గుణసాగర్ రైల్వే ట్రాక్‌పై శవమై తేలారు. నిన్న సాయంత్రం ఇంటి నుంచి ఒంటరిగా కారులో బయటకు వెళ్లిన ధర్మె గౌడ.. అర్ధరాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు. ఆయన కుటుంబ సభ్యులు, భద్రతా సిబ్బంది తీవ్రంగా గాలించినా ఆయన ఆచూకీ దొరకలేదు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆయన జాడ కోసం వెతుకుతున్న క్రమంలో తెల్లవారుజామున 2గంటల సమయంలో ధర్మె గౌడ మృతదేహాన్ని రైల్వే ట్రాక్ పక్కన గుర్తించారు.
రైలు కిందపడి ధర్మె గౌడ ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలిలో ఓ సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా అవమాన భారంతోనే ధర్మె గౌడ బలవన్మరణానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. డిసెంబర్ 15న శాసన మండలి సమావేశాల్లో అధికార, విపక్ష సభ్యులు పరస్పరం దాడి చేసుకున్నారు. జేడీఎస్ సభ్యుడైన చైర్మన్‌పై కాంగ్రెస్, బీజేపీ సభ్యులు స్థాయి మరిచి ప్రవర్తించారు. ఆ రోజు సమావేశానికి సభాధ్యక్ష స్థానంలో కూర్చున్న ఆయన్ను కిందకు లాగిపడేసారు. ఆ తర్వాత ఓ కాంగ్రెస్ సభ్యుడు అందులో కూర్చున్నాడు. దీంతో కుర్చీని స్వాధీనం చేసుకొనేందుకు సభ్యులు పరసర్పం పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. ధర్మెగౌడ మరణం కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపే అవకాశముంది.