కలిసి నిలుస్తారా.. నిలిచి గెలుస్తారా!?
– తెలంగాణపై కర్ణాటక ఎన్నికల ఎఫెక్ట్ ఉంటుందా?
– హస్తం ఆశలు నెరవేరేనా?
– అసలు.. కర్ణాటక పరిస్థితులేంటి?
– తెలంగాణలో రాజకీయ సమీకరణాలేంటి?
– బీఆర్ఎస్, బీజేపీ వాదనేంటి?
– విశ్లేషకులు ఏమంటున్నారు?
కర్ణాటక ఎన్నికలు ముగిశాయి. కాంగ్రెస్ విజయం సాధించింది. ఇప్పుడు ఇదే జోష్ లో పక్కనే ఉన్న తెలంగాణను కూడా కైవసం చేసుకోవాలని చూస్తోంది. అయితే.. దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆ రాష్ట్రంలోని రాజకీయ సమీకరణాలు, సమస్యలు, పరిస్థితులకు, తెలంగాణలోని ప్రస్తుత పరిణామాలకు చాలా తేడా ఉందనేది వారి వాదన. కర్ణాటకలో బీజేపీని, జేడీఎస్ ని దీటుగా ఎదుర్కోగలిగే పార్టీ కాంగ్రెస్ ఒక్కటే. ఆ రాష్ట్ర ఎన్నికల రణక్షేత్రంలో ఇది నిరూపితమైంది కూడా. యాంటీ బీజేపీ వేవ్ ని ఉపయోగించుకుని కమలాన్ని కాంగ్రెస్ చావుదెబ్బ కొట్టగలిగింది.
అవినీతిలో 40 శాతం కమీషన్, ధరల పెరుగుదల, మతతత్వ రాజకీయాలు, నిరుద్యోగం, మైనారిటీలకు రిజర్వేషన్లు వంటి పలు అంశాల్లో బీజేపీ.. అక్కడ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. ఈ అంశాలపై కర్ణాటక కాంగ్రెస్ ప్రజలను చైతన్యవంతులను చేయడమే గాక.. తన ప్రయోజనాలకు వీటిని వినియోగించుకోగలిగింది. కానీ తెలంగాణలో ఈక్వేషన్స్ పూర్తిగా వేరనేది రాజకీయ పండితుల వాదన.
ఇక్కడి కాంగ్రెస్ లో అసమ్మతి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కొందరు నేతలు కలిసి రావడం లేదు. సొంత పార్టీ నేతలపైనే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇదంతా సెట్ అయితే.. కాంగ్రెస్ అనుకున్న లక్ష్యం నెరవేరడం పెద్ద కష్టం కాదనేది విశ్లేషకుల వాదన. అంతేకాకుండా, కర్ణాటకలో మాదిరిగా ప్రభుత్వ వఫల్యాలపై అందరు నేతలు కలిసికట్టుగా కదిలితే తిరుగే ఉండదని సూచిస్తున్నారు.
అయితే.. బీఆర్ఎస్ నేతలు మాత్రం తెలంగాణ, కర్ణాటకల్లో ఉండే పరిస్థితులు వేరని అంటున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణలో ఉండదని మంత్రి కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు. తెలంగాణ శాసన సభ ఎన్నికలకు మరో నాలుగైదు నెలల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. పాలక బీఆర్ఎస్ ఈ ఎన్నికలకు పూర్తి స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తోంది. సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు నేతలందరికీ దిశానిర్దేశం చేస్తున్నారు. కానీ, కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చి తీరుతామని ధీమాగా చెబుతున్నారు.