ఇప్పటివరకూ వచ్చిన తెలుగు ధారావాహికల్లో “కార్తీకదీపం’’ సంపాదించుకున్న క్రేజ్ అంతా ఇంతాకాదు. రామాయణాన్నిపోలిన ఈ కథ. ఆ ఇతిహాసం మాదిరిగానే ఎంతో ప్రజాదరణ పొందింది. హీరోహీరోయిన్ల గొడవతో మలుపు తిరిగిన ఈ సీరియల్ చిత్రవిచిత్ర మలుపులు తిరిగింది. జనాన్ని టీవీలకు అతుక్కుపోయేలా చేసింది.
ఈ సీరియల్లోని నాయకా నాయికల పేర్లతో సినిమాల్లో సైతం ఎన్నో కామెడీసీన్లు పురుడు పోసుకున్నాయి. మెగస్టార్ చిరంజీవి తల్లి కూడా ఈ సీరియల్ ని క్రమం తప్పకుండా చూసేవారంటే ఈ సీరియల్ కి ఉన్న క్రేజ్ గురించి అర్ధం చేసుకోవచ్చు. “ఛీ’’ డాక్టర్ బాబు, వంటలక్కలు ఇక ఎప్పటికీ కలవరు అని ఓ స్థాయి నమ్మకం వచ్చేసి విసిగి ఊరుకున్నారు జనం.
ప్రేక్షకుల అసహానాన్ని దృష్టిలో ఉంచుకుని వాళ్ళిద్దర్నీ కలిపి కూడా ఎన్నో మలుపులు తిప్పారు సీరియల్ నిర్వాహకులు. ఇన్నేళ్ళ తర్వాత సదరు నిర్మాణ సంస్థలకే విసుగొచ్చి సీరియల్ కి ముగింపు పలుకుదాం అనుకుని ఎట్టకేలకు శుభం కార్డు వేశారు. అయితే వస్తూ జనాన్ని,రాయిస్తూ రైటర్ని ఏడిపించిన ఈ కార్తీక దీపం ఓ విచిత్రమైన క్రైమ్ కి కారణం అయ్యింది.
డాక్టర్ బాబు, దీపలను ఇక చూడలేనన్న బాధతో కార్తీకదీపం సీరియల్ ఆఖరి ఎపిసోడ్ చూస్తు ఓ షాపు యజమానిని అరువు కోసం విసిగించిన ఓ వ్యక్తి చేతిని కొరికేసి రక్తం కళ్ళజూసేలా చేసింది. ములుగు జిల్లా వెంకటాపూర్ (రామప్ప) పోలీ్‌సస్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బైటకు వచ్చింది. పాలంపేటకు చెందిన గట్టు మొగిలి కిరాణా దుకాణం నిర్వహిస్తుంటాడు. మద్యం కూడా విక్రయిస్తుంటాడు. అదే గ్రామానికి చెందిన తాళ్లపెల్లి వెంకటయ్య జనవరి 23న రాత్రి మొగిలి దుకాణానికి వచ్చి మద్యం కొనుగోలు చేసి తాగాడు.
అనంతరం అరువుగా మరికొంత మద్యం కావాలని విసిగించాడు. ఈ తరుణంలో కార్తీకదీపం సీరియల్ చూస్తున్న మొగిలి సహనం కోల్పోయి వెంకటయ్యపై దాడి చేసి అతని కుడి చేతి చూపుడు వేలిని కొరికేశాడు. ఈ ఘటనపై వెంకటయ్య తర్వాతి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ చేసిన పోలీసులు.. కార్తీక దీపం చూస్తుంటే విసిగించడంతోనే దాడి చేశానని మొగిలి చెప్పిన సమాధానంతో అవాక్కయ్యారు. మొగిలిపై కేసు నమోదు చేశారు.