కార్తికేయ 2 సినిమాతో థియేటర్లలోకి రాబోతున్నాడు నిఖిల్. ఈ సినిమా కేవలం థ్రిల్లర్ కాదంటున్నాడు. ఇందులో భక్తిరసం కూడా ఉందంటున్నాడు. ఇంకా చెప్పాలంటే అన్నమయ్య, అరుంధతి సినిమాల్ని కలిపితే కార్తికేయ2 అవుతుందని చెబుతున్నాడు.
“నేను సినిమా ఆల్రెడీ చూశాను. ఇంటర్వెల్ కు ముందు 30 నిమిషాలు అద్భుతంగా ఉంది. ఇక క్లైమాక్స్ కు 20 నిమిషాలు సినిమా చూసినప్పుడు నాకు తెలియకుండానే రెండు చేతులు నమస్కరించాయి. అంత భక్తిభావం ఉంది ఈ సినిమాలో. మన అమ్మమ్మ, నాన్నమ్మలను కూడా తీసుకొచ్చి ఈ సినిమా చూపించొచ్చు. ఇంకా చెప్పాలంటే.. అప్పుడెప్పుడో వచ్చిన అన్నమయ్య, అరుంధతి సినిమాల్ని కలిపి మా సినిమాలో చూడొచ్చు.”
ఇలా కార్తికేయ 2పై స్పందించాడు నిఖిల్. కృష్ణ తత్వంతో తెరకెక్కిన ఈ సినిమా కోసం ద్వారకలో షూట్ చేశారు. అక్కడ ఏమాత్రం అభివృద్ధి కనిపించలేదంటున్నాడు నిఖిల్. గుడి తప్ప, చుట్టుపక్కల ప్రాంతం ఏదీ టూరిజం పరంగా అభివృద్ధి చెందలేదని.. తాజ్ మహల్ ను ఎంత బాగా చూసుకుంటున్నామో.. ద్వారక, రామసేతు లాంటి ప్రాంతాల్ని కూడా అంతే బాగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందంటున్నాడు ఈ హీరో.
చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కింది కార్తికేయ-2. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను 12వ తేదీన విడుదల చేయబోతున్నారు.