కార్తికేయ2.. ఈమధ్యకాలంలో బ్లాక్ బస్టర్ హిట్టయిన అతికొద్ది సినిమాల్లో ఇదీ ఒకటి. నిఖిల్ హీరోగా నటించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇండియా వైడ్ హిట్టయింది. నిఖిల్ ను పాన్ ఇండియా హీరోగా నిలబెట్టింది. వరల్డ్ వైడ్ దాదాపు 120 కోట్ల రూపాయలు ఆర్జించిన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చింది.
దసరా కానుకగా జీ5లో కార్తికేయ2 ను స్ట్రీమింగ్ కు పెట్టారు. ఓటీటీలో కూడా ఈ మూవీకి అనూహ్య ఆదరణ దక్కింది. ఎంతలా అంటే, స్ట్రీమింగ్ కు వచ్చిన 48 గంటల్లోనే 100 కోట్ల నిమిషాల పాటు ఈ సినిమాను నెటిజన్లు వీక్షించారు. ఆర్ఆర్ఆర్ తర్వాత జీ5 యాప్ కు అత్యంత ఆదరణ తీసుకొచ్చిన సినిమాగా కార్తికేయ2 నిలిచింది.
త్వరలోనే ఈ సినిమా జీ తెలుగులో కూడా ప్రసారం కాబోతోంది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఈ నెల్లోనే టీవీల్లోకి రాబోతున్న ఈ సినిమా మంచి రేటింగ్స్ సాధిస్తే, మరో అరుదైన ఘనత దక్కించుకున్నట్టు అవుతుంది.
అటు థియేటర్లు, ఇటు ఓటీటీతో పాటు, టీవీల్లో కూడా సూపర్ హిట్టయిన అతి కొద్ది సినిమాల జాబితాలోకి కార్తికేయ2 చేరుతుంది. ఇలా అన్ని ఫార్మాట్స్ లో హిట్టయిన సినిమాలు ఈమధ్యకాలంలో చాలా తక్కువ. కార్తికేయ2 సినిమా ఆ లిస్ట్ లోకి చేరుతుందో లేదో చూడాలి.
చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్-అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ సినిమా, సదరు నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.