కార్వి స్టాక్ బ్రోకింగ్ అక్రమాలపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నాంపల్లి కోర్టులో అభియోగ పత్రాలను సమర్పించారు. మదుపరుల షేర్లు తమదేనంటూ బ్యాంకులో రుణాలు తీసుకుని మీరు మోసం చేశారని మదుపరుల ఫిర్యాదుల మేరకు నాలుగు కేసులను పోలీసులు నమోదు చేశారు. మొత్తం మూడు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు స్వాహా చేసిందని పోలీసులు గుర్తించారు.
ఎనిమిది ఏళ్లలో ఈ మోసాలు చేశారని సాక్షాధారాలు కూడా సేకరించారు. ఐదు వేల పత్రాలతో కూడిన సాక్ష్యాధారాలను ఏ సి పి ఎస్ వి హరికృష్ణ మూడు రోజుల క్రితం కోర్టుకు సమర్పించారు. కార్వి స్టాక్ బ్రోకింగ్ చైర్మన్ పి పార్ధ సారధి సహా ఎనిమిది మందిని అరెస్టు చేశారు పోలీసులు. ప్రస్తుతం బెంగళూరు జైల్లో ఉన్న పార్థసారథిని హైదరాబాద్ కు పీటి వారెంట్ కింద తీసుకువచ్చాక కోర్టుకు నివేదించనున్నారు.